ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌర స్మృతి అమలులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. దీనికోసం బిజెపి ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని 2022 మే 27న నియమించింది. ఈ కమిటీ దాదాపు ఏడాదిన్నర పాటు కసరత్తు చేసి నాలుగు సంచికల్లో సవివరమైన, సమగ్రమైన యూసీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది. ఈక్రమంలో ఉత్తరాఖండ్‌లోని అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు.
ఆ తర్వాత ప్రభుత్వ ప్రక్రియ మొదలైంది. గత ఏడాది ఫిబ్రవరి 2న యూసీసీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది. ఈ బిల్లును 2024 ఫిబ్రవరి 7న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఇది జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కూడా లభించింది.
ఆ తరువాత మార్గదర్శకాల కోసం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శత్రుఘ్న సింగ్ సారథ్యంలో నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ 2024 సంవత్సరం చివర్లో రాష్ట్ర సర్కారుకు నివేదికను సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర కేబినెట్ యూసీసీ అమలుకు తేదీని నిర్ణయించే అధికారాన్ని సీఎం ధామికి కట్టబెడుతూ తీర్మానం చేసింది.
యూసీసీలోని కీలక అంశాలివే!
1) వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా యూసీసీ ఉంటుంది.
2) మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్‌లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు యూసీసీ దోహదం చేయనుంది.
సహ జీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. సహ జీవనం చేస్తున్నవారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
4) సైనికులు, వాయుసేనలో పని చేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా, సులభంగా తయారు చేయించవచ్చు.
5) అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది.
6) అన్ని మతాల్లో బహుభార్యత్వం నిషేధించారు.
7) హలాల్ విధానంపై నిషేధం విధించారు.
దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తీసుకు రావాలని సామాజిక విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.