ఇల్లరికంలోనే ఉంది మజా అని గతంలో ఒక తెలుగు సినిమా పాట వినిపిస్తూ ఉంటుంది. ఊరు మొత్తం మీద గతంలో నాలుగు అయిదు ఇళ్ళలో ఇటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మనం ఒక ఊరిని చూస్తున్నాం. అక్కడ ఊరంతా ఇల్లరికం అల్లుళ్ళే. ఒక్క గ్రామంలో మాత్రమే కాదు చుట్టుపక్కల 20 ఊర్లలో అదే పరిస్థితి.
భారతదేశంలో సాధారణంగా పెళ్లయిన తర్వాత అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాత నుంచి అక్కడే అమ్మాయి కాపురం మొదలు అవుతుంది. కానీ తమిళనాడులోని ఒక ప్రాంతంలో దీనికి రివర్స్ గా ఉంటుంది. పెళ్లి తర్వాత అబ్బాయిని అత్తవారింటికి పంపిస్తారు. ఇక అక్కడి నుంచి అబ్బాయి అక్కడే స్థిరపడిపోయి కుటుంబం నడుపుకుంటాడు.
తమిళనాడు లోని తూత్తుకుడి ప్రాంతము సముద్ర తీరంలో ఉంటుంది. ఇక్కడ చాలా గ్రామాలు మత్స్యకార గ్రామాలే. స్వాతంత్ర్యానికి ముందే చిదంబరం చెట్టియార్ అనే సమరయోధుడు పరిశ్రమలు నిర్వహించారు. సొంతంగా ఓడలు కొని నౌకాయానం చేపట్టారు. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళ వ్యవహారాలు దగ్గర నుంచి చూశారు. అక్కడ సమాజంలో పురుషులకు మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఉండడం గమనించారు. అదే మాదిరిగా మనదేశంలోనూ మహిళలకు అవకాశాలు దక్కాలి అని ఆయన తలపోసారు. ఇందుకు తగినట్లుగా ఆయన పరిశ్రమలు వ్యాపారాలకు సంబంధించిన పనుల్లో మహిళలకు కూడా ఉద్యోగాలు కల్పించేవారు. కానీ అప్పట్లో స్త్రీలకు చదువు శిక్షణ అవకాశాలు పెద్దగా ఉండేవి కాదు. చిన్నతనంలోనే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే వేయడంతో అక్కడ అంతా మగవాళ్ళ ఆధిపత్యం ఉండేది. దీనిని బ్రేక్ చేయాలి అంటే కనుక సాంప్రదాయాలు కొంతమేర మార్చుకోవాలి అని అప్పట్లో భావించారు.
ఈ ఒరవడి కొనసాగుతుండగా నెమ్మదిగా అక్కడ గ్రామాల్లో మార్పు వచ్చింది. తూత్తుకుడి ప్రాంతంలోని శివకలై, పూడూర్, పొట్టలూరణి, సెక్కారకుడి వంటి గ్రామాల్లో ఈ కొత్త సాంప్రదాయం అమల్లోకి వచ్చేసింది. అంటే అందరూ ఇల్లరికం అల్లుళ్లే అన్న మాట.
ఈ చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల్లో ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. చాలావరకు బంధువులు ఈ గ్రామాల్లోనే ఉంటూ ఉంటారు. అందుచేత పెళ్లి సంబంధాలు ఈ గ్రామాల మధ్యనే కలుపుకుంటూ ఉంటారు.
సాంప్రదాయ బద్దంగా పెళ్లి పూర్తి అయిన తర్వాత పెళ్లికూతురుని మొదటగా అత్తవారింటికి పంపిస్తారు. అక్కడ పూజాదికాలు అయిన తర్వాత వధువు వెనక్కి పుట్టింటికి వచ్చేస్తుంది. అనంతరం అబ్బాయిని తీసుకుని వచ్చి ఇక్కడ దించి వెళ్తారు. ఇక అప్పటినుంచి అమ్మాయి ఇంట్లోనే కాపురం కొనసాగుతుంది. తల్లి తండ్రుల బాధ్యత కూడా అమ్మాయిలదే. అప్పుడప్పుడు ఇంటి కుమారులు వచ్చి చుట్టపు చూపు గా చూసి వెళ్తుంటారు.
ఈ సాంప్రదాయం పూర్తిగా అన్ని గ్రామాల్లోనూ కొనసాగుతోంది.
ఈ మధ్యకాలంలో చదువులు పెరిగిన తర్వాత ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు. అక్కడ కాపురాలు పెడుతున్నారు. కానీ పుట్టింటి సపోర్ట్ మాత్రం అమ్మాయి ఇంటి నుంచే ఉంటుంది. మహిళా సాధికారత తమిళనాడులో ఈ రూపంలో కొనసాగుతోంది అనుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఛలో తూత్తుకూడి అంటే ఒక పని అయిపోతుంది ఏమో..!