ఉప్పల ఉత్సాహం.. మేల్కొన్న ప్రభుత్వం.. దేత్తడికి షాక్..!
యూట్యూబ్,ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా స్టార్ దేత్తడి హారికాకు తెలంగాణ పర్యాటక శాఖ షాకిచ్చింది. సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజం పర్యాటక సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా హారికాను నియమించి.. ఆమెకు నియామక పత్రాన్ని అందించారు. అయితే మరుసటి రోజే తెలంగాణ పర్యాటక శాఖ ఆమెకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెకు సంబంధించిన వివరాలను టూరిజం వెబ్సైట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. బ్రాండ్ అంబాసిడర్‌గా నియామించి.. అనంతరం ఒక్కరోజు తర్వాత ఇలా వివరాలను తొలగించడంపై కొందరు రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తెలంగాణ టూరిజం పర్యాటక సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా.. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటుగా.. సీఎంవో అధికారులకు కనీస సమాచారం లేకుండా బ్రాండ్ అంబాసిడర్‌గా హారికను నియమించినట్లు తెలుస్తోంది. అయితే చైర్మన్ ఇలా చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. దీనిపై శ్రీనివాస్ గుప్తా నుంచి సీఎంవో వివరణ కోరినట్లు సమాచారం.
మరోవైపు దేత్తడి హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడంతో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటే..యూట్యూబ్ స్టార్‌గా సత్తా చాటడం, బిగ్ బాస్‌లో పాల్గొనడమే అర్హతలా అంటూ ప్రశ్నించారు. ఎవరెస్ట్ శిఖరంతో పాటు.. ప్రపంచలోని పలు ఎత్తైన పర్వతాలను అధిరోహించిన మాలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికైన వారణాసి మానస వంటి తదితరులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించొచ్చు కదా అంటూ సూచించారు.