మహిళను దూషించిన కేసులో పరారీలో ఉన్న స్వయం ప్రకటిత బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిని పోలీసులు ఈరోజు మీరట్ లో అరెస్టు చేశారు. ఇటీవలే ఓ మహిళతో శ్రీకాంత్ త్యాగి అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ త్యాగిని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద నేరారోపణలు నమోదు చేశారు. సిద్ధార్థపురి కాలనీలో తన మిత్రునితో కలిసి దాక్కున్న త్యాగిని పోలీసులు పట్టుకున్నారు. నొయిడా పోలీసులు, యూపీ ఎస్టీఎఫ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించిన త్యాగి ఆచూకీ గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. త్యాగితో పాటు అతను దాక్కోడానికి సహకరించిన ఇద్దరు మిత్రులను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
శ్రీకాంత్ త్యాగి ఓ మహిళను దుర్బాషలాడి, దాడి చేసిన ఘటన, ఆపై అనుచరులతో బెదిరింపులకు గురిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీకాంత్ త్యాగికి చెందిన ఓ అక్రమ నిర్మాణంపై స్థానికులు ఎప్పటి నుంచో ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే చెట్లను నాటడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళ పట్ల శ్రీకాంత్ త్యాగి దాడి చేశాడు. దాంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రంగంలోకి దిగిన అధికారులు చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న త్యాగిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగి ఆచూకి తెలిపిన వారికి రూ.25,000 రివార్డు కూడా ప్రకటించారు. నోయిడాలోని సెక్టార్ 93 బి గ్రాండ్ ఓమాక్స్ సోసైటీలోని శ్రీకాంత్ త్యాగి అక్రమ నిర్మాణాన్ని అధికారులు ఇటీవలే బుల్డోజర్ తో తొలగించిన విషయం తెలిసిందే. ఇక్కడే స్థానిక మహిళకు అతనికి వాగ్వాదం ఏర్పడింది.