దళిత బాలికపై అత్యాచారానికి యత్నించి.. విషం తాగించి చంపేసిన సాహిల్ అనే వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సహ్రాన్ పూర్లోని దేహత్ కొత్వాలిలో ఈ ఘటన జరిగింది. సమీపంలోని బిజోపురి అటవీప్రాంతంలో అచేతనంగా ఉన్న బాలికను స్థానికులు గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది.
తొమ్మిదోతరగతి చదువుతున్న ఆ బాలిక పాఠశాలకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన సాహిల్, అతని స్నేహితులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.ఆమెపై అత్యాచార యత్నం చేశారు. అయితే ఆ బాలిక ప్రతిఘటిస్తూ కేకలు వేసింది. ఆమె తీవ్రంగా ప్రతిఘటిస్తుండడంతో … బలవంతంగా విషం కలిపిన ఆహారం తినిపించారు. తరువాత ఆమెను సమీపంలోని అటవీప్రాంతంలో వదిలేశారు. బాలిక పరీక్షకు హాజరుకాలేదని ఉపాధ్యాయురాలు ఫోన్ చేయడంతో తల్లిదండ్రులు కంగారుపడి వెదకడం మొదలుపెట్టారు.
గతంలో ఆమెతో గొడవపడిన సాహిల్ పై వారికి అనుమానం వచ్చింది. గ్రామస్తులంతా నిలదీయగా అతను నేరం అంగీకరించాడు. బిజోపురి అడవిలో పడేసినట్టు ఒప్పుకున్నాడు. వాళ్లంతా అక్కడికి వెళ్లేసరికే ఆమె నురగకక్కుతూ అపస్మారకస్థితిలో ఉంది. ఆస్పత్రికి తరలించేసరికి ఆమె చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు.
బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ముస్లిమేతర పిల్లలు లక్ష్యంగా లవ్ జిహాద్ లు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.