విమానంలో సహ ప్రయాణుడికి ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరద్. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి ముంబై వస్తుండగా…విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు కళ్లు తిరిగి స్పృహ కోల్పోయాడు. ఆ విమానంలోనే ఉన్న మంత్రి హుటాహుటిన ముందుకొచ్చి అతనికి ప్రధమ చికిత్స అందించారు. ఆయన్ని కేంద్రమంత్రిగా గుర్తుపట్టిన ఇతర ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు. భగవత్ సకాలంలో స్పదించకపోతో ప్రాణాలు దక్కేవి కావని వారంటున్నారు. ఇక మంత్రిని పొడుగుతూ ఆయన చికిత్స చేస్తున్న ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు.
వృత్తి రీత్యా సర్జన్ అయిన డాక్టర్ కరాద్… విమానంలోని ఎమర్జెన్సీ కిట్ నుండి రోగికి ఇంజెక్షన్ చేసి గ్లూకోజ్ కూడా ఇచ్చారు. రోగి చెమటతో తడిసి ఉన్నాడని, అతని బీపీ తక్కువగా ఉందని అతని షర్ట్ తొలగించి ఛాతీకి మసాజ్ చేశారు. దాదాపు 30 నిమిషాల తర్వాత అతను స్పృహలోకి వచ్చాడు. విమానం ల్యాండయ్యాక అతన్ని ముంబైలోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అటు మంత్రివర్గ సహచరుడు చేసిన మంచి పనిని అభినందించారు ప్రధాని మోదీ. తన సహచరుడు చేసిన పని తనకు చాలా సంతోశాన్ని కలిగించిదంటూ ట్వీట్ చేశారు ప్రధాని.
ఈ విషయాన్ని ఇండిగో కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మంత్రి తన విధులను నిరంతరాయంగా నిర్వహిస్తున్నందుకు మేము అభినందిస్తున్నాము. తోటి ప్రయాణికుడికి సహాయం చేయడంలో డాక్టర్ భగవత్ కరద్ సహకారం స్ఫూర్తిదాయకం.” అని ఇండిగో ఎయిర్లైన్స్ తన ట్వీట్ లో పేర్కొంది. ”వైద్యుడు హృదయంలో ఎప్పుడూ వైద్యుడిగానే ఉంటాడు. నా సహచరుడు చేసిన అద్భుతమైన పని ఇది” అంటూ దానికి మోడీ చేసిన రీట్వీట్ అందర్నీ ఆకర్షిస్తోంది.