మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు, ఫిర్యాదులపై
కేంద్రమంత్రి నారాయణ రాణెను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని చెంప దెబ్బకొట్టేవాడిని అని ఆయన అన్నారంటూ ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదయ్యాయి. జన ఆశీర్వాద్ యాత్రలో ఉన్న సమయంలో రత్నగిరిలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాయగఢ్ జిల్లాలో పర్యటన సందర్భంగా రాణె …ఉద్ధవ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అధికార పార్టీ వాళ్లు ఆరోపిస్తున్నారు. రాయగఢ్, పూణే, నాసిక్ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిలు కోసం నారాయణ్ రాణే చేసిన విజ్ఞప్తిని రత్నగిరి కోర్టు తిరస్కరించింది.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా తన ప్రసంగంలో తడబడ్డారని… ముఖ్యమంత్రికి స్వాతంత్య్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైందో తెలియకపోవడం సిగ్గుచేటని రాణె అన్నట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తాను అక్కడ ఉండి ఉంటే గట్టిగా చెంప దెబ్బ కొట్టి ఉండేవాడినన్న రాణె వ్యాఖ్యలపై అధికార పార్టీ శ్రేణులు కేసులు పెట్టారు.