దేశంలోని ప్రసిద్ధి చెందిన దుర్గాపూజకు యునెస్కో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. పశ్చిమబెంగాల్లో దుర్గా నవరాత్రుల్లో భాగంగా చేసే పూజలు ఎంతో ప్రశస్తమైనవి. డిసెంబర్ 13 నుండి 18 వరకు పారిస్లో జరుగుతున్న కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పేద,ధనిక, లింగబేధం, మతబేధాల్లేకుండా జనులందరూ ఐక్యంగా చేసుకునే వేడుక ఇదని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్ పర్యాటక శాఖ గత సెప్టెంబర్లో … కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపగా… కేంద్రం దుర్గాపూజ ప్రాశస్త్యాన్ని తెలుపుతూ యునెస్కోకు ప్రతిపాదనను పంపింది.
సంప్రదాయ విశ్వాసాలు, కళల మేళవింపు దుర్గాపూజ అని…కులమతాలకు అతీతంగా పేద, ధనిక అనే తేడా లేకుండా అందర్నీ కలిపే వేడుక దుర్గాపూజ అంటూ ఈ సందర్భంగా యునెస్కో కీర్తించింది. వేడుక సందర్భంగా భారీ స్థాయిలో చేసే ఏర్పాట్లు… ముఖ్యంగా మంటపాలు, సంప్రదాయ బెంగాలీ వాయిద్యహోరు, పూజా విధానాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. దుర్గాపూజకు దక్కిన గౌరవంపై మోదీ ట్విట్టర్ వేదిగ్గా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులకెంతో గర్వకారణమైన విషయం ఇదని ఆయన అన్నారు. దుర్గా పూజను కేవలం పూజగా మాత్రమే చూడబోమని…అదొక గొప్ప మానసిక భావన అని బెంగాల్ సీఎం మమతా బెనర్దీ అన్నారు. గతంలో 2017లో కుంభమేళా, అంతకు ఏడాది ముందు యోగాకు ఇలాంటి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పంజాబ్లోని సాంప్రదాయ ఇత్తడి, రాగి హస్త కళలకు 2014లో గుర్తింపు లభించగా, మణిపూర్ సంప్రదాయ సంకీర్తనా గానానికి 2013లో యునెస్కో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాకు చెందిన చౌ జానపద నృత్యానికి 2010లో ఇటువంటి గుర్తింపు లభించింది, ముడియెట్టు, ఆచార థియేటర్, కేరళ నృత్య నాటకం, రాజస్థాన్లోని కల్బెలియా జానపద పాటలు, నృత్యాలతో పాటు, కుటియాట్టం సంస్కృత థియేటర్, రాంలీలా, వేద మంత్రాల సంప్రదాయం, లడఖ్ బౌద్ధ శ్లోకాలు గతంలో ఇలాంటి గుర్తింపును పొందాయి.