శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ని తిరిగి నియమింపచేసేలా ఆదేశాలు ఇవ్వలేమంది. ఆయన బలపరీక్ష వరకు ఆగకుండా స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయడమే అందుకు కారణమంది. అదే సమయంలో ఏక్ నాథ్ షిండే చీఫ్ విఫ్ నియామకం చెల్లదని, అది చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్టీలో విభేదాలను పార్టీలోనే పరిష్కరించుకోవాలి తప్ప గవర్నర్ జోక్యం తగదంది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమకోహ్లి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ తొలుత ఏక్నాథ్ షిండే సుప్రీంను ఆశ్రయించారు. షిండేతో ప్రమాణ స్వీకారం, బల నిరూపణకు ఆదేశిస్తూ గవర్నర్ చేపట్టిన చర్యను సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే సైతం సుప్రీంను ఆశ్రయించారు. 2022 ఆగస్టులో రాజ్యాంగ ధర్మాసనానికి నాటి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేసును బదిలీ చేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో పొందుపర్చిన అనర్హత అంశాలతో పాటు ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 సహా అనేక రాజ్యాంగపరమైన అంశాలపై వాదనలు జరిగాయి. స్పీకర్ను తొలగించాలంటూ ఒక పిటిషన్ పెండింగులో ఉండగా, ఆ స్పీకర్ అనర్హత అంశాలపై నిర్ణయం తీసుకోవడం కుదరదని షిండే వర్గం వాదించింది. ఉద్ధవ్ ఠాక్రే తరఫున ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. షిండే వర్గం తరఫున సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌల్, హరీశ్ సాల్వే, మహేశ్ జెఠ్మలానీ, మనీందర్ సింగ్ వాదనలు వినిపించారు. మహారాష్ట్ర గవర్నర్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వాదనలు వినిపించారు.
                                                                    



