ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల పట్టణం అయిన రాయచోటి లో ఉగ్రవాదుల స్థావనం బయట పడింది. ఇద్దరు కరడు కట్టిన ఉగ్రవాదులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు పట్టుకొన్నారు. నిందితుల నివాసాల్లో భారీ పేలుళ్లకు ఉపయోగించే..పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, వాకీటాకీలు, పేలుడుకు వాడే వైర్లు లభ్యమైనట్లు తెలుస్తుంది. దీంతో ఈ విషయం దక్షిణ భారత దేశంలోనే సంచలనం కలిగిస్తోంది.
పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులలో ఒకరు అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీగా తమిళనాడు పోలీసులు గుర్తించారు. అయితే వీరు తమిళనాడులో మారు పేర్లతో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ అబూబకర్ సిద్దిక్ తన పేరును అలియాస్ నాగూర్గా, మహమ్మద్ అలీ తన పేరును మేళపలయంగా చెప్పుకొని తిరుగుతున్నట్టు పోలీసులు పసిగట్టారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్న ఉగ్రదాడులు చాలా ఉన్నాయి. 1995లో చెన్నై చింతాద్రిపేటలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుడు లో పాలు పంచుకొన్నారు. 1995లో నాగూరులో పార్సిల్ బాంబు పేలుడు కి మూలంగా నిలిచారు. 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, కేరళ ప్రాంతాలలోని ఏడు చోట్ల బాంబులు ఉంచిన సంఘటనలో నిందితులుగా ఉన్నారు. అంతేగాక చెన్నైలో పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా బాంబులు కూడా పెట్టినట్లు సమాచారం. 2011లో మధురైలో ఎల్కే అద్వానీ రథయాత్ర సమయంలో పైపు బాంబుకు సంబంధించి నిందితులుగా ఉన్నారు.
ఈ ఇద్దరు ఉగ్రవాదుల కోసం తమిళనాడు పోలీసులు ఎప్పటి నుంచో వెదకుతున్నారు. కానీ అక్కడ నుంచి మాయం అయిన ఈ ఇద్దరు కరడుకట్టిన ఉగ్రవాదులు … రాయచోటి కి చేరుకొని ఇక్కడ స్థిర పడ్డారు. ఇక్కడ అనేక మంది యువకులకు రహస్యంగా శిక్షణ ఇస్తున్నారని భావిస్తున్నారు. మత విద్వేషాలను నూరిపోస్తూ, కొత్త టీమ్ ను రెడీ చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రాయచోటిలో రెండు సంఘటనలు కలకలం రేపాయి. గత ఏడాది చివరలో అయ్యప్ప స్వామి భక్తుల మీద దాడులు జరిగాయి. అనంతరం మూడు నెలల క్రితం వీరభద్రస్వామి ఊరేగింపును అడ్డుకొని భక్తుల మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో స్థానిక ఎస్ ఐ నరసింహారెడ్డి.. ఉల్టాగా హిందూ భక్తులపైనే కేసులు బనాయించారు. ఈ విషయంలో హిందూ సంఘాలు చైతన్య వంతంగా వ్యవహరించి పోలీసు ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసు ఉన్నతాధికారులు.. రాయచోటి మీద సీరియస్ గా ఫోెకస్ చేశారు. రహస్యంగా దర్యాప్తు చేయించటంతో ఉగ్రవాదుల మూలాలు బయట పడ్డాయి.
రాయచోటి లో వీరభద్రస్వామి ఊరేగింపు సమయంలో హిందువుల మీద దాడులను తేలిక గా తీసుకొని ఉంటే, ఉగ్రవాదుల వ్యవహారాలు బయట పడేవి కాదు. హిందూ సంస్థల చైతన్యంతో పాటు పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తత కలిసి వచ్చింది. లోతుగా దర్యాప్తు చేయటంతో అసలు ఉగ్రవాదులు దొరికిపోయారు. దాదాపు పాతిక ముప్పై ఏళ్లుగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని స్లీపర్ సెల్స్ ను తయారు చేస్తున్నట్లు లెక్క తేలింది. దీంతో స్థానికంగా చోటు చేసుకొన్న అనేక ఘటనల మీద పోలీసు ఉన్నతాధికారులు నిఘాను ముమ్మరం చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన స్లీపర్ సెల్స్ ఎన్ని వైపులకు జారుకొన్నారు అనే దాని మీద ఆరా తీస్తున్నారు.
రాయచోటి ఘటన తో పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. స్లీపర్ సెల్స్ వివిధ పట్టణాలు, నగరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న పాటి ఘర్షణలు, దాడులు జరిగినప్పుడే అప్రమత్తంగా వ్యవహరించి, వివరాలు లోతుగా తెలుసుకోవాలి. అప్పుడే మనకు శ్రీరామ రక్ష