అయోధ్య రామ మందిరం మీద విమర్శలకు లోటే లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం గట్టి పట్టుదలతో చేసిన కృషి ఫలించింది. దీంతో వందల ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది. అయోధ్యలో భగవాన్ శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రాంతంలో భవ్యమైన దేవాలయాన్ని నిర్మించగలిగారు. అన్ని వర్గాలను ఒప్పించి ఈ దేవాలయంలో ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. అందుచేత ఈ పార్లమెంటు ఎన్నికల్లో అయోధ్య రామ మందిరం అనేది ఎన్నికల టాపిక్ గా మారింది. సహజంగానే ఈ ఖ్యాతి బిజెపికి దక్కుతుంది అనడంలో సందేహం లేదు.
ఈ విషయాన్ని గమనించి ప్రతిపక్ష పార్టీలు అసూయతో రగిలిపోతున్నాయి. అయోధ్య మీద, రామ మందిరం మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. గుడులు గోపురాలు నిర్మిస్తే ఏం వస్తుంది.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచకుండా బిజెపి ప్రభుత్వం చతికిల పడింది అని విమర్శిస్తున్నారు. అందుచేతనే గుళ్ళు గోపురాలు అంటూ బిజెపి పాత చింతకాయ పచ్చడి చూపిస్తోందని చెబుతున్నారు. ఆలయాల నిర్మాణంతో ఏమాత్రం ఉపయోగం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్, సమాజ్ వాది వంటి నాయకులు అయోధ్య రామ మందిరాన్ని తొలగిస్తామంటూ కూడా నోరు పారేసుకుంటున్నారు. కానీ ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్న విశ్లేషణ మరోలా ఉంది.
భారత్ వంటి విపరీత జనాభా కలిగిన దేశంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో టూరిజం ను ప్రోత్సహించినట్లయితే విరివిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుచేతనే టూరిజం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తూ వస్తున్నది.
ప్రాథమికంగా భారతదేశంలో మతసాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. అందులో భాగంగా పుణ్యక్షేత్రాల సందర్శన ఎప్పటినుంచో ఉంది. ఈ క్రమంలో అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేయడం ద్వారా ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే రామ మందిరం గొప్పతనం అన్ని వైపులా వ్యాపించింది. అందుచేత దేశం నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు తరలి రావడం జరుగుతోంది.
ఈ అంశం మీద ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థలు చేసిన అధ్యయనం కొత్త విషయాలను బయట పెట్టింది. అయోధ్యలో రానున్న కాలంలో రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని లెక్క వేసింది. ఇప్పటికే రామ మందిరం కారిడార్ నిర్మాణం ద్వారా వేల మందికి ఉపాధి కలిగిందని ప్రముఖ హెచ్ ఆర్ సంస్థ బెటర్ ప్లేస్ లెక్కల తో సహా బయట పెట్టింది రానున్న కాలంలో ఈ ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని బెటర్ ప్లేస్ సంస్థ సీఈవో ప్రవీణ్ అగర్వాల్ అంటున్నారు. రామ మందిరం ఇతర ఆలయాలు సందర్శనీయ ప్రాంగణాలలో విపరీతంగా ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని ఆయన వివరించారు.
టూరిస్టుల తాకిడి ఇప్పటికే రోజుకి లక్ష దాకా ఉంటోంది. ఈ యాత్రికులకు ఇబ్బంది లేకుండా విరివిగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. శుచిగా, శుభ్రత గా ఉండే హోటల్స్ పెద్ద సంఖ్యలో ఏర్పాటు అయ్యాయి. ఇతర వసతుల కల్పనలో స్థానిక వ్యాపారులు పోటీ పడుతున్నారు. అయోధ్య అంతట టూరిజం హబ్ గా మార్చగలిగారు . చిన్నాచితక వస్తువులు అమ్ముకునే వ్యాపారులు మొదలుకొని, పెద్ద పెద్ద కళాకృతులు అందించే వాణిజ్య వేత్తల దాకా ఇక్కడ ఉన్నారు.
మరో వైపు, అయోధ్యకు యాత్రికులను తీసుకువచ్చేటందుకు రైల్వే శాఖ విస్తారంగా కృషి చేస్తోంది. దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ప్రపంచ దేశాల్లో కూడా అయోధ్య గురించి ప్రచారం జరగడంతో విమాన మార్గాల్లో కూడా ఇక్కడికి యాత్రికులు వస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అయోధ్యలో విమానాశ్రయం కూడా ఏర్పాటు అయింది. ఫలితంగా ఇప్పుడు వస్తున్న యాత్రికుల సంఖ్య త్వరలోనే రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఒకటిన్నర లక్షల నుంచి 2 లక్షల దాకా యాత్రికులు … ప్రతిరోజు అయోధ్యను సందర్శిస్తారని అంచనా. ఇంత భారీ సంఖ్యలో వస్తున్న యాత్రికుల సౌకర్యాల కోసం ఉద్యోగులు సహాయకులు అంతే ఎక్కువ సంఖ్యలో అవసరం.
అయోధ్యలో అన్ని ప్రధాన బ్యాంకులు తమ శాఖలను ఏర్పాటు చేశాయి. విద్య వైద్యం మౌలిక వసతులు వంటి రంగాలకు సంబంధించిన వ్యాపారాలు జోరందుకున్నాయి. విభిన్న రంగాలలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఏర్పాటు అవుతున్నాయి. ఈ విధంగా వివిధ రంగాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తారంగా పెరిగాయి.
ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో ముస్లింల జనాభా కూడా అధికము. చాలా కాలంగా ఈ ముస్లిం కమ్యూనిటీ .. బీదరికం తో బాధపడుతోంది. కానీ అయోధ్య అభివృద్ధి చెంది, యాత్రికులు వస్తూ ఉండటంతో వ్యాపారాలు ఊపందు కొన్నాయి. దీంతో ముస్లిములు కూడా ఆదాయాలు తెచ్చుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో.. అయోధ్య చుట్టుపక్కల జరిగిన సర్వేలో మరో విషయం బయటపడింది. మందిర్ మసీద్ విషయాన్ని తామంతా వదిలేశామని, ఆదాయాలు తెచ్చుకుంటూ ఆనందంగా బతుకుతున్నామని స్థానిక ముస్లింలు చెబుతున్నారు. చుట్టుపక్కల ఉన్న మసీదుల్లో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్నామని కలిసికట్టుగా బతుకుతున్నామని స్పష్టం చేస్తున్నారు.
అయోధ్యలోని ప్రజానీకం ఆనందంగా ఉన్నారు .. ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెచ్చుకున్న చుట్టుపక్కల జనం ఇంకా బాగున్నారు… అయినప్పటికీ ప్రతిపక్షాల కడుపు మంట మాత్రం చల్లారడం లేదు. ఇది మాత్రం దురదృష్టకరం.