ఢిల్లీ అసెంబ్లీ భవనం నుంచి ఎర్రకోటను కలుపుతూ ఉన్న సొరంగమార్గాన్ని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. బ్రిటీషర్ల కాలంలో దీన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ శాసనసభ నుంచి చాందినీ చౌక్‌లోని ఎర్రకోటను కలుపుతూ ఈ సొరంగ మార్గం ఉంది. నాటి స్వాతంత్య్ర సమరయోధులను తరలించేందుకు ఈ సొరంగమార్గాన్ని ఉపయోగించారని చెబుతున్నారు. 1912 లో రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చినపుడు ఇప్పుడున్న అసెంబ్లీ భవనాన్ని వినియోగించారు. 1926 లో కోర్టుగా మార్చారు. ఆ సమయంలో సమరయోధులను కోర్టుకు తీసుకురావడానికి ఈసొరంగమార్గాన్ని ఉపయోగించారు. అయితే ప్రస్తుతం ఆ మార్గంలో మెట్రో పిల్లర్లు, సీవేజ్ నిర్మాణాలు ఉన్నందున ఆ రహస్య మార్గం మూతబడింది. సొరంగ మార్గాన్ని పునరుద్ధరించి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని డిల్లీ అసెంబ్లీ స్పీకర్ తెలిపారు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాటికి సొరంగం పునరుద్ధరణ పనులు పూర్తి చేసే యోచనలో ఢిల్లీ సర్కారు ఉంది.