అగ్రరాజ్యాల చదరంగం సృష్టిస్తున్న సంక్షోభాలు, బలహీనపడుతున్న అమెరికా ప్రపంచ నాయకత్వం ఒకవైపు, మరోవైపు నాటో దేశాలు స్వాభావికమైన వైరుధ్యాలు, పరిమితులు, ఇంకొక వైపు ఇవన్నీ కలగలిసిన సమయంలో రష్యా ఉక్రేన్ పై చేస్తున్న దాడిని విశ్లేషణ చేసుకోవలసిన అవసరం ఉంది. రష్యా తాను కూడా ప్రపంచంలో ఒక తిరుగులేని సైనిక శక్తి అని మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నట్లుగా అర్థమవుతున్నది. అమెరికా బలహీనపడుతున్నది అనే భావన, అమెరికా రష్యాల మధ్య విభేదాలు, పాశ్చాత్య దేశాలలో దౌత్యపరమైన అస్తవ్యస్తత, మరోవైపు చైనా సైనికంగా ఆర్థికంగా శక్తివంతమవుతున్నది దానిని ఎదుర్కొనేందుకు మొదలైన చదరంగంలో రష్యా తన వివిధమైన డిమాండ్లను పాశ్చాత్య దేశాల ముందుకు తీసుకుని వెళ్ళటానికి మారుతున్న పరిస్థితులను ఉపయోగించుకుంటోంది, చైనా అమెరికాల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడితే రష్యా అమెరికాల మధ్య ఘర్షణ వైఖరి తగ్గుముఖం పట్టవచ్చు అందుకే చైనా కూడా రష్యా నుండి వ్యూహాత్మక మద్దతు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నది. యూరప్, అమెరికా ల ఒత్తిడుల కారణంగా చైనా రష్యాలు ఒక్కటయ్యే అవకాశాలను కాదనలేము అందుకే అమెరికా చైనా రష్యాల మధ్య దూరం పెంచడానికి ధీర్ఘకాలిక కుట్రలు పన్నుతున్నదని వాదనను కొట్టి వేయలేము. సమీప భవిష్యత్తులో చైనా తనకు ముప్పుగా పరిణమించవచ్చు కాబట్టి చైనాను కట్టడి చేయడానికి పాశ్చాత్య దేశాలు రష్యా ఎడల అనుసరించవలసిన విధానాలను అమెరికా ఆలోచిస్తోందా ? చైనా విధాన నిర్ణేతల ఆలోచన ప్రకారం చైనా రష్యా భారత్ ఒక కూటమిగా ఏర్పడాలి ఎందుకంటే రష్యా కూడా ఒక విస్మరించలేని శక్తి, మరో ప్రక్క భారత్ అమెరికాల మధ్య సంబంధాలు పెరగటం, దశాబ్దాలుగా భారత రష్యా సంబంధాలు ఈ రెండు కలసి ప్రపంచంలో భారత్ పరిస్థితి మెరుగుపరుస్తోంది, రష్యాకు కూడా చైనా తో సంబంధాల కంటే భారత్ తో సంబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది , ఇదే జరిగితే అమెరికాలో కూడా మార్పులు రావచ్చు దానితో అమెరికా రష్యా భారత్ ఒక కూటమి కావచ్చు ఇటువంటి చర్చల నేపథ్యంలో రష్యా ఉక్రేన్ పై దాడిని విశ్లేషించాలి.
ఉక్రేన్ పై రష్యా దాడి కి ముందే రష్యా ఫై అమెరికాలో సర్వే
రష్యా ఉక్రేన్ పై దాడికి చాల పూర్వమే రష్యాపై అమెరికా ప్రజల అభిప్రాయ సేకరణకు ఒక సర్వే నిర్వహించబడింది. ఆ సర్వేలో 26% మంది ప్రజలు ఉక్రెయిన్ సమీపంలో రష్యా సైనిక నిర్మాణాలు అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా భావిస్తుంటే 33% శాతం మంది ప్రజలు అది అంత పెద్ద ముప్పు కాదు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు, 7% మంది అయితే అది అసలు ముప్పే కాదని చెప్పారు. అమెరికాలోని పెద్దల్లో 49% మంది రష్యా అమెరికాకు పెద్ద పోటీదారు అని భావిస్తూ ఉంటే 41% మంది రష్యా అమెరికాకు శత్రువు అని తేల్చి చెప్పారు, కేవలం 7% మంది మాత్రమే రష్యా అమెరికాల భాగస్వామ్యం కావాలని చెప్పారు.
రష్యా పై అమెరికా నాటో దేశాల దృష్టి కోణం ఆ కూటమి వ్యవహారం
ఇంకో ప్రక్క సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యా బలగాలు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు తూర్పు ఐరోపా దేశాలు నాటో కూటమి[ నాటో కూటమి లో 1) కెనడా 2) క్రొయేషియా3) ఫ్రాన్స్ 4 )జర్మనీ 5) గ్రీస్ 6) హంగేరి 7) చెక్ రిపబ్లిక్ 8) డెన్మార్క్ ఉన్నాయి] దేశాల్లో చేరిపోయాయి. సోవియట్ యూనియన్ తన శక్తులను తిరిగి సమీకరించుకోవడానికి పుతిన్ వచ్చిన దగ్గర నుండి తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది ఒక రకంగా. ఉక్రెయిన్ రెండు అగ్రరాజ్యాల మధ్య తీవ్రమైన పోటీగా మారిపోయింది. ఉక్రెయిన్ తన పరిధిలో నుండి పోకుండా చూసుకోవడానికి రష్యా దాడి చేస్తోంది, ఈ దాడిని ఎదుర్కోవడానికి పాశ్చాత్య దేశాలు సిద్ధంగా లేవు, ఇప్పటి సంగ్రామ పరిస్థితి ఏమిటంటే అమెరికా, నాటో దేశాలు ఉక్రేన్ కు సైనిక బలగాలు సహాయం చేయడానికి ఒప్పుకోవడం లేదు, ఒకవేళ నాటో దళాలు అక్కడ ఉండి ఉంటే అది ఒక ప్రపంచ యుద్ధానికే దారి తీసేది, అణు యుద్ధం జరిగే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఇప్పటి పరిణామాలకు 1998 లో అమెరికా సెనేట్ లో నాటో తూర్పువైపు విస్తరణకు రూపొందించిన వ్యూహాత్మక స్వార్ధం. ఇప్పటి ఉక్రెయిన్ యుద్ధానికి కారణం అమెరికా నాటో ఆధిపత్యంకై జరిగేదే దానికి అంతర్జాతీయ చట్టాలను బలహీనపరచడం కూడా జరుగుతున్నది, అలా మహాభారతంలోని శకుని పాత్ర అమెరికా అధ్యక్షుడు పోషిస్తున్నాడు. ఈ సమయంలో సమకాలీన చరిత్రను విశ్లేషించుకోవాలి.
అమెరికా దీర్ఘకాలిక ఎత్తుగడలు
బులిటెన్ అఫ్ అటామిక్ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ”సన్నగిల్లుతూ, సవాళ్లు ఎదుర్కొంటున్న అమెరికా ప్రపంచ ఆధిపత్యం నిలబెట్టుకోవటం కోసం ఐరోపాలో మరో యుద్ధాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది, అమెరికాకు ఎప్పుడూ యుద్ధం మంచిదే రెండవ ప్రపంచ యుద్ధంలో ఐరోపా, రష్యాలో 50 మిలియన్ల మంది ప్రజలు చంపబడ్డారు అమెరికా దృష్టిలో అమెరికాకు ఆ యుద్ధం చాలా కీలకమైనది ఆ యుద్ధమే అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టింది, ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక శక్తిగా సైనిక శక్తిగా ఆవిర్భవించినది, ప్రచ్ఛన్న యుద్ధాలతో రష్యా సామ్రాజ్యం పడిపోవడం కూడా అమెరికాకు ఎంతో మేలు చేసింది, మరోసారి యుద్ధం ప్రేరేపించడంతో తన నాయకత్వాన్నిసుస్థిర పరుచుకోవచ్చునని అమెరికా భావిస్తున్నది. చైనా వల్ల అమెరికాకు ముప్పు పొంచి ఉంది, ఇప్పటి వరకు ప్రపంచం అమెరికా చట్రంలో పడి ఉంది లేక ఒదిగి ఉంది ఆ చట్రం ఇప్పుడు ఆసియా ఖండంలోకి మారే పరిస్థితి ఉంది, ఆసియా దేశాల పోటీ నేపథ్యంలో తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి అమెరికా ఐరోపాలో యుద్ధం ప్రారంభం చేయాలని తద్వారా ఐరోపాను బలహీన పరచాలని రష్యాను చిన్నాభిన్నం చేయాలని పథకాలు రచిస్తున్నది రష్యా లిస్బన్ నుండి వ్లాడివోస్టాక్ వరకు అభివృద్ధి జోన్లుగా మార్చాలని ఆలోచిస్తుంటే అమెరికా ఆ భూభాగాలను ధ్వంసం చేసే రచన చేస్తోంది దానితో మొత్తం యూరప్ ను యుద్ధం లోకి లాగాలని చూస్తున్నది, ఇది ఒక రకంగా ఐరోపాలోని వనరులపై ఆధిపత్యం కొనసాగించడానికి చైనాను ఓడించటానికి దాని ముందు ఉన్నా ఇదే ఏకైక మార్గం. అమెరికా ఎగదోస్తూన్న ఈ యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్ రెండు బలిపశువులే. ఐరోపా కూడా బాధితురాలుగా ఉన్నది. ఐరోపాను అస్థిర పరచడమే అమెరికా లక్ష్యంగా కనబడుతుంది ఇటువంటి విషయాలను రష్యా కు చెందిన రష్యన్ మేధావి సెర్గీ గ్లాజీవ్ 2014 లోనే చూచాయిగా వెల్లడించాడు.
సమకాలీన చరిత్ర చెప్పే పాఠాలు ఏమిటి ?
సమకాలీన చరిత్ర చెప్పే పాఠాలు ఏమిటంటే అగ్ర రాజ్యాలుగా పేరుపొందిన అమెరికా రష్యాలు అనేక దేశాలలో ఆక్రమించుకోవడానికి సుదీర్ఘ కాలం యుద్ధాలు చేశాయి. దానికి తగిన మూల్యం చెల్లించుకుని అవమానకరంగా వెనుకకు మళ్లాయి దానివల్ల అగ్రరాజ్యాలు, అవి ఆక్రమించుకున్న దేశాలలో ఆర్థికంగా నష్టము ప్రాణ నష్టం మాత్రమే జరిగింది. కానీ అగ్ర రాజ్యాలు విజయాలు సాధించలేకపోయాయి. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో చరిత్ర అందరికి తెలుసు. ఇప్పుడు ఉక్రెయిన్ పై జరుగుతున్న దాడి వల్ల జన నష్టం, ఉక్రెయిన్ ఆర్థికంగా కుప్పకూలవచ్చు, పుతిన్ ఉక్రెయిన్ మీద అదుపు తీసుకోవచ్చు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ ఒక వీడియో ప్రసంగంలో ”US, పాశ్చాత్య దేశాలు మమ్మలిని మేము రక్షించుకోవడానికి వదిలిపెట్టాయి, మీకు మానవతా సహాయం చేస్తాం మీకు మద్దతు ఇస్తాం మిమ్మల్ని రక్షించుకోవడానికి పోరాడండి” అనే సందేశం ఇస్తున్నారు, ఒకరకంగా రష్యా అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించి” might is right” నిరూపించింది. ఉక్రెయిన్ భారత్ తో సంబంధాల కంటే భారత్ వ్యతిరేక వైఖరి ఉండేది, పై కొద్దీ పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చేది, అయినా భారత ప్రధాని నరేంద్ర మోదీ శాంతి చర్చలకు పుతిన్ తో మాట్లాడారు.
చివరగా భారత్ ఏమి నేర్చుకోవాలి?
దౌత్యపరమైన ఒత్తిడి భారత్ పై చాలా ఉన్నది దానిని భారత్ చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నది రష్యా కు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వలేదు, రష్యా చర్యలను ఖండించలేదు, శాంతియుత చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. UN నిర్వహించిన సమావేశాలకు భారత్ దూరంగా ఉన్నది, దౌత్య పరంగా ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ తాను చేయవలసిన ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఈ పరిస్థితుల నుండి భారత్ ఏమి నేర్చుకోవాలి భారత్ తన రక్షణ కోసం యుద్ధ ప్రాతిపదికన రక్షణ ఉత్పత్తులను నిర్మాణం చేసుకోవాలి, తన భద్రత కోసం మిత్ర దేశాలు, భద్రతా మండలి పై ఏమాత్రం ఆధారపడకూడదు అనేది ఒక పెద్ద పాఠం.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)