పాకిస్తాన్ ప్రధాన మంత్రి నేతృత్వంలోని 14 మంది సభ్యుల నామినేటెడ్ సంస్థ అయిన సర్వాధికారాలు గల కాశ్మీర్ కౌన్సిల్ ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే లో పాలనను నిర్వహిస్తుంది. ఆరుగురు సభ్యులను పాకిస్తాన్ ప్రభుత్వం నామినేట్ చేసింది మిగిలిన ఎనిమిది మంది “ఆజాద్ కాశ్మీర్” “ప్రధాన మంత్రి” తో సహా పీఓకే అసెంబ్లీ, ప్రభుత్వానికి చెందినవారు ఉంటారు.
పీఓకేలో మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నికలు 1970 లో జరిగాయి. 1974 లో దాని స్వంత “మధ్యంతర” రాజ్యాంగం అమలులోకి వచ్చింది (కాశ్మీర్ సమస్య తుది పరిష్కారం పెండింగ్‌లో ఉంది), అదే సంవత్సరంలో పాకిస్తాన్‌కు మొదటి పూర్తి స్థాయి రాజ్యాంగం లభించింది.
అసెంబ్లీలోని 53 సీట్లలో నలభై ఐదు నేరుగా ఎన్నుకోబడిన సభ్యుల కోసం – 33 నియోజకవర్గాలకు చెందినవి కాగా, 12 పాకిస్తాన్ లోగల నాలుగు రాష్ట్రాలలోని “శరణార్థుల నియోజకవర్గాలు”. 1947 లో భారతదేశం నుండి పాకిస్థాన్ కు వలస వచ్చిన వారిని సూచిస్తుంది. అసెంబ్లీలో మిగిలిన ఎనిమిది సీట్లు నామినేషన్ ద్వారా నింపుతారు.
పీఓకెలో ఎన్నికలలో పోటీలో ఉన్న పార్టీలు, పోటీదారులు పాకిస్తాన్ రాజకీయాలకు అద్దం పడుతుంటారు. గెలిచిన పార్టీ సాధారణంగా ఇస్లామాబాద్‌లో అధికార పార్టీ వారే ఉంటారు. ఇస్లామాబాద్‌లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధికారంలో ఉన్నప్పుడు 2016 లో పీఓకేలో చివరి ఎన్నికలు జరిగాయి. పిఎంఎల్ (ఎన్) సులభంగా మెజారిటీని గెలుచుకుంది. రాజా ఫరూక్ హైదర్ “ఆజాద్ కాశ్మీర్” ప్రధాన మంత్రిగా, మసూద్ ఖాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఈ నమూనాకు అనుగుణంగా, 2018 లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) ప్రస్తుత ఎన్నికలలో విజయం సాధిస్తుందని విస్తృతంగా భావిస్తున్నారు. అయితే, నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం ప్రసంగించిన పిఎంఎల్ (ఎన్) ర్యాలీలు భారీగా జనాన్ని ఆకర్షిస్తున్నాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావాల్ భుట్టో జర్దారీ కూడా అనేక ర్యాలీలలో ప్రసంగించారు.
ప్రతి ఎన్నికల ప్రచారంలో, కాశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులే ప్రధాన అంశాలుగా ఉంటూ వస్తున్నా, ఇస్లామాబాద్, ముజఫరాబాద్ లలో అధికార పార్టీ పాలనా అంశాలను కూడా ప్రస్తావనకు వస్తాయి.
కాశ్మీర్లో భద్రతా దళాలు మిలిటెంట్ నాయకుడు బుర్హాన్ వానిని హత్య చేసిన కొన్ని రోజుల తరువాత గత చివరి ఎన్నికలు జరిగాయి. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, అప్పుడు పనామా పేపర్స్ కేసు, ఇతర అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఒక ఏడాది తర్వాత న్యాయవ్యవస్థ అతనిని తొలగించింది.
వానిని “అమరవీరుడు” గా పేర్కొంటూ, భారత దళాలు మానవ హక్కుల ఉల్లంఘనలు పాల్పడుతున్నట్లు ఆరోపణలు గుప్పించారు. కాశ్మీర్ లోయ ప్రజలకు సంఘీభావంగా ఎన్నికల రోజును “బ్లాక్ డే” గా ప్రకటించారు. కాశ్మీరీల “స్వీయ-నిర్ణయం కోసం పోరాటం” కు తన పార్టీ, ప్రభుత్వ మద్దతును ప్రకటించారు.
ఈ సారి ఎన్నికలలో 2019 ఆగస్టు 5 న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న చర్యలని ప్రధాన ఎన్నికల అంశాలుగా ప్రచారం చేస్తున్నారు. తమ ప్రచార ప్రసంగాల్లో, మరియమ్ నవాజ్, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కాశ్మీర్లో భారత చర్యలకు చట్టబద్ధత ఇచ్చిందని ఆరోపించారు. మరోవంక, పీఓకేను పాకిస్థాన్ లో ఒక రాష్ట్రంగా మార్చాలనే ప్రణాళికను ఇమ్రాన్ ఖాన్ రహస్యంగా ప్రవేశపెట్టారని, అందుకోసం ఇక్కడ ఒక “కీలుబొమ్మ ప్రధాని” కోసం చూస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.