మరి ఎప్పుడో చచ్చిపోయిన కాళన్నను ఇంకా మనం ఎందుకు యాది జేసుకోవాలె. ఎందుకంటే కాళన్న తన రాతతోటి , తీరుతోటి మన గుండెల్ల నిలిచిండు గనుక. తెలంగాణ అంటె కాళోజీ, కాళోజీ అంటే తెలంగాణ అన్నట్టు బతికిండు గనుక.
జనం దిక్కు నిలబడ్డడు..జనం కొరకే బతికిండు.. జనంకోసమె కవితలు చెప్పిండు. జనం తరుపునే మాట్లాడిండు. జనం తరుపున్నే కొట్లాడిండు. అన్యాయం మీద తిరగబడమన్నడు. అవినీతి మీద పోరు చెయ్యమన్నడు.
ఓసీ ప్రభుత్వమా దోపిడీవర్గాల నువ్వు అదుపులో పెట్టజాలనప్పుడు
పీడిత వర్గాల నేను తిరగబడమంటే తప్పా అని జనం ముందుండి పులిలెక్క గాండ్రించిండు, సింహం తీర్గ గర్జించిండు.
చిన్న గొడవనా అది. అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి..
అన్యాయం అంతరిస్తే నా గొడవకు విముక్తి అని చాటిండు.
దిగజారుతున్న సామాజిక, రాజకీయ ప్రజాస్వామ్య విలువలమీద కాళోజీ మండిపడ్డడు.జీవితమంతా పోరాటం జేసిండు. బతుకంతా ఉద్యమాలు జేసిండు . పోరాటోద్యమాలల్ల జనం గొడవను తన గొడవగ చెప్పిండు. అది గుడ అందరికి అల్కగ అర్థమయ్యే పలుకుబళ్ల భాషల.
మనుషులమధ్య ఎక్కువతక్కువలెందుకన్నడు. ప్రశ్నించలేని బతుకూ ఓ బతుకేనా అన్నడు. మనిషిమీద ఇంకోమనిషి పెత్తనాన్ని , దౌర్జన్యాన్ని ప్రశ్నించిండు. ప్రజల ఆవేదనను ఆవేశంగా కవితారూపంలో వెదజల్లిండు.రాజకీయాల్లో అవినితీని జూసి కాళన్న కలత చెందిండు..
అవనిపై జరిగేటి అవకతవకలు జూచి
ఎందుకో నా మదిని ఇన్ని ఆవేదనలు
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుని
దొరలై వెలిగే దెన్నాళ్లు అని మదన పడ్డడు.
ప్రజాజీవితాన్ని కవితలో ప్రతిబింబించిన ప్రజాకవి కాళన్న.మనిషిని మనిషిగా బతుకాలే అని చెప్పిన మహా మనీషి కాళన్న. చిన్నప్పుడు బడిలో గణపతి ఉత్సవాలు జరపనీయనందుకు లేచిన ఆ ధిక్కార స్వరం చివరికంటా దిక్కుల్ని పిక్కటిల్లేలా చేసింది. ఆర్యసమాజం, గ్రంథాలయోద్యమం, హైదరాబాద్ స్టేట్ విమోచనోద్యం ప్రత్యేక తెలంగాణోద్యమం , హక్కుల ఉద్యమం ..ఇట్లా అన్నింట్ల పాల్గొన్నడు.
చెలిమలు చెలమలు ఊరేదాక
చెలిమి కలుములు నిలిచేదాకా
బ్రతుకమ్మ బ్రతుకు
అమ్మను మరువని సంతానము కని
బ్రతుకమ్మా బ్రతుకు అని బతుకమ్మను ఎంత సక్కగ బతికిచ్చిండు.
అభ్యర్థి ఏపార్టీ వాడని కాదు
ఏపాటివాడో చూడు
మనిషిని చూడు-చరిత్రను చూడు
నుడువులు కాదు,నడవడి చూడు
ఎంతసక్కని మాటలివ్వి. ఇట్లాంటివి కాళోజీ కాక ఇంకెవ్వరన్నా చెప్పుదురా
కాళోజీకి భాషంటే ఇష్టం. యాసంటే ప్రాణం. తన యాసను యీసడిస్తూ మాట్లాడేటొళ్ల అవహేళనను తిప్పికొట్టిండు. వాక్యంలో మూడు పాళ్లు ఇంగ్లీష్ వాడుకుంట తెలంగాణీయుల మాటలో ఉర్దూపదం దొర్లంగనే హిహి అని ఇగిలిస్తరా అని కన్నెర్ర జేసిండు.
అన్ని రుతువులనూ తట్టి చూసిన కాళోజీ…
హిమవంతుడు నింగి చీల్చి
తలదూర్చగ హేమంతం
జీవనదుల జీవననముల
సమకూర్చగ హేమంతమంటూ ఎంత ముద్దుగ, సరళంగ వర్ణించిండో..
అంబవు వజ్రపు గుండెగల చెండివి నీవెనమ్మా
మేమంతా నలుబది కోట్లు నీ సంతానమే
నిజముగ భరతమాతవు నీవేనమ్మా తల్లీ అని ప్రాంతీయాభిమానమే కాదు దేశమాతను గూడ ఉన్నతంగ కొనియాడిన గొప్ప దేశభక్తుడు.
నీ పొత్తిలిగుడ్డలెత్తి ఉతికి
నిన్ను యెదకు హత్తుకున్న అమ్మకు
నీ చెత్తాచెదారం పనులకు
వీపు చెదర చరిచే అధికారం
ఎక్కడిదనిఅడుగకు అంటూ…అమ్మగురించి మన కాళన్న చెప్పిన ఈమాటలింటె కళ్లు చెమర్చకుండ ఉంటయా!?
CONSPIRACY కేవలం ఐఎంఎఫ్ దేనా ? దేశంలోని దోపిడీ వర్గాలు వారికి సాయపడే దేశీయ ప్రభుత్వాన్ని గదా మనం ఎదురించవలసింది… కుట్రను బైటపెట్టవలసిందీ అన్నడు.. మనకు అందుబాటులోలేని మనం ఎదురించలేని ఐఎంఎఫ్ ని తిట్టి ఏంలాభం అంటూ సామాన్యులకోణంలో ఎట్లా ఆలోచించిండు కదా.
మళ్లీ ఒక దుమారంగా రేగండి
మళ్లీ ఒక ఉప్పెనగా లేచి దూకండి
అవినీతిని గద్దెదించండి…లేవండి లేవండి ..ఎంత ఊపుంది ఈ మాటల్ల. సామాన్యుల గురించి ఇట్ల అసామాన్యంగా చెప్పినోడు ఇంకెవరన్న ఉన్నరా. పీవీ అన్నట్టు కాళోజీ ఏనాడు సింహగర్జన చేశాడో ఆ కాలం మళ్ల రాదు. ఈనాటి కాలం సింహగర్జన చేయాలంటే ఎవరూ వినరు.
చెవిసోకిన వాణి శృతిగ
తలనిలిచిన వాణి స్మృతిగ
వేదవేదాంగములందున
విదితమై వేడ్కతోనే
భారతీశారదా వాణీ
వీణాపాణినీ రాణీ..అంటూ వాణిని వీనులవిందుగా ఎంత చక్కగ కీర్తిచ్చిండు.
ఎదురూబొదురూ లేని అధికారం
ఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతమే ఫాసిజం అన్న ఆయన మాటలకు వెలకట్టగలరా ఎవరైన.
కాళన్నిది నిక్కచ్చైన నిఖార్సైన వ్యక్తిత్వం. ఎక్కడ ఆధిపత్యం, అధికార దుర్వినియోగం ఉన్నయో ఆడ వాలిండు. కవిత కట్టిండు. మనిషిని మనిషిగా చూడనిచ్చే సమాజమే తన ఆకాంక్ష అంటూ ఆశపడ్డడు. కాళన్న కవిత్వం శక్తిమంతమైతే ఆయన జీవితం నిరాడంబరం . విలువలతో ప్రమాణాలతో బతికిండు. ఇంత గొడవచేస్కుంటనే ఇది సరిపోదన్నడు. నేనింకా నానుంటి మాదాకానే ఎదగలేదు. మనం అన్నప్పుడు కదా ముందడుగు అన్నడు. కోటిన్నర మేటి ప్రజల గొంతొక్కటి గొడువొక్కడి..తెలంగాణ వెలసినిలిచి ఫలించాలె భారతాన అని ఆకాంక్షించిండు.
ఉదయం కానేకాదనుకోవడం- నిరాశ
ఉదయించి అట్లానే ఉంటుందనుకోడం-దురాశ అంటూ భాషించిన కాళన్నను ఎవరైనా ఎట్ల యాది మరుస్తరు.
ధార్మికుని దానాలు పండితుని భాష్యాలు
వర్తకుని వ్యాజ్యాలు వక్కీళ్ల వాదాలు
సైనికుని శౌర్యాలుయాంత్రికుని యంత్రాలు
యోధుల యుద్ధాలు రాజుల రాజ్యాలు
కర్షకా నీ కఱ్రు కదిలినన్నాళ్లే అని రైతు గొప్పతనం గురించి, సమాజానికి రైతు అసవరం గురించి ఎట్లా జెప్పిండు. మరి ఇన్ని మరవలేని, మరువరాని ముచ్చట్లు చెప్పిన కాళోజీని తెలంగాణ ఎట్ల మరుస్తది, ఎందుకు మరుస్తది.
అవును కాళోజీ నిన్నటి స్వప్నం.. రేపటి జ్ఞాపకం, కాళోజీ ప్రస్తుతం, కాళోజీ ఇప్పటి క్షణం, కాళోజీ నిగనిగలాడ నెగడు, రేపును రేపే దగడు. ఒక్క ముక్కల చెప్పాల్నంటె తెలంగాణ అంటె కాళోజీ, కాళోజీ అంటె తెలంగాణ.