జూలై నెల 26వ తేదీని కార్గిల్ విజయ దివస్ గా జరుపుకోవడం ఆనవాయితీ. 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ సరిహద్దుల్లో దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తం అయిన మన సైనిక బలగాలు వీరోచితంగా పోరాడి విజయం సాధించాయి.
కార్గిల్ యుద్ధం జరిగిన తీరు అంతకుముందు జరిగిన కుట్ర గురించి ఈ తరం ప్రజానీకం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కార్గిల్ యుద్ధం హఠాత్తుగా జరిగింది కాదు. దానికి ఎంతో పూర్వ చరిత్ర ఉంది. పూర్వం కార్గిల్ జమ్ముకశ్మీర్ సంస్థానంలోని గిల్గిత్-బాల్టిస్తాన్ జిల్లాలో భాగం. విభిన్న భాషలు, మతాల ప్రజలు నివసించేవారు. 1947లో కశ్మీర్ సంస్థానం భవిష్యత్తును తేల్చడంలో జాప్యం జరిగింది. అప్పుడే గిరిజన మూకల ముసుగులో పాక్ సైన్యం దురాక్రమణకు దిగింది. కశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ వెంటనే భారత్‌లో విలీనం చేశారు. భారత సైన్యం పాక్ మూకలను తిప్పికొట్టింది. ఈ సందర్భంగా జరిగిన పరిణామాల్లో నియంత్రణ రేఖ బాల్టిస్తాన్ జిల్లా మీదుగా వెళ్లగా కార్గిల్ ప్రాంతం భారత దేశంలోని జమ్ముకశ్మీర్‌లో భాగమైంది. ఐదేళ్ల క్రితం ఏర్పడిన లద్దాక్ పరిధిలోకి వచ్చింది.
శ్రీనగర్ మంచుమయం. అక్కడ నుంచి 205 కి.మీ.ల దూరంలో ఉంది కార్గిల్. అక్కడ శీతా కాలంలో ఉష్ణోగ్రత మైనస్ 48 సెల్సియస్ డిగ్రీలు. శ్రీనగర్ -లెప్ాలను కలిపే జాతీయ రహదారి కార్గిల్ మీదుగా పోతుంది. వ్యూహాత్మంగా భారత్‌కు కీలకమైన ప్రాంతం.
భారత్, పాకిస్తాన్ల సరిహద్దు వివాదానికి మూలం సియాచిన్ హిమానీ నదం. ఇది నివాస యోగ్యం కాదు. సియాచిన్ 1949 కరాచీ ఒప్పందం, 1972 సిమ్లా ఒప్పందంలో ఏ దేశానికి చెందుతుందో ప్రస్తావించనే లేదు. ఆరంభంలో దీన్ని ఇరు దేశాలు తటస్థ భూమిగా భావించాయి. అయితే కశ్మీర్‌పై పట్టు సాధించే క్రమంలో సియాచిన్ ప్రాధాన్యతను గుర్తించిన పాకిస్తాన్ దాన్ని తమ అధీనంలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేపట్టింది. ఇందులో భాగంగా 1970,80లలో సియాచిన్ ప్రాంతంలోకి పర్వతారోహకులు ప్రవేశించేందుకు పాకిస్తాన్ అనుమతులు ఇచ్చింది. సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్, పాకిస్తాన్‌లు చలికాలంలో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాయి. కానీ భారత సైన్యం లేని సమయంలో పాకిస్తాన్ ఈ ప్రాంతాలను ఆక్రమించు కోవడం ప్రారంభించింది. ఈ పన్నాగాలను గ్రహించిన భారత సైన్యం ఏప్రిల్ 13, 1984న ‘ఆపరేషన్ మేఫ్ుదూత్’ను చేపట్టింది. పాకిస్తాన్ కూడా తమ దళాలను మోహరించినా భారత్ తిప్పి కొట్టి సియాచిన్‌ను తమ అధీనంలోకి తీసుకుంది. దీనితో పాకిస్తాన్ సేనల అహం దెబ్బతింది. నాటి నుంచీ ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ వచ్చింది పాకిస్తాన్.
1998లో నాటి భారత ప్రధాని వాజపేయి పోఖ్రాన్లో విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించారు. అమెరికా బెదిరింపులు, ఆంక్షలకు తలొగ్గకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆపరేషన్ ‘శక్తి’పేరుతో మే 11, 13 తేదీల్లో జరిపిన పరీక్షలివి. భారత క్షిపణి పితామహుడు అబ్దుల్‌కలాం కీలకపాత్ర పోషించారు. దీనితో అణు సామర్థ్యం కలిగిన ఆరవ దేశంగా భారత్ నిలిచింది. ఈ పరిణామంతో పాకిస్తాన్, చైనా నుంచి అరువు తెచ్చుకొన్న పరిజ్ఞానంతో మే 28, 30 తేదీల్లో అణుపరీక్షలను నిర్వహించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని సూచించారు.
సరిహద్దు వివాదాలు ఉన్నా ఇరు దేశాల ప్రజల మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఉండాలని ప్రధాని వాజపేయి భావించారు. ఫలితమే న్యూ ఢల్లీి -లాహోర్ మధ్య బస్సు. ఆరంభంలో ఆయనే లాహోర్‌ను సందర్శించారు. అక్కడ ఫిబ్రవరి 21, 1999న వాజపేయి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య శిఖరాగ్ర చర్చలు జరిగాయి. ఇద్దరు నేతలు లాహోర్ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం రెండు దేశాలు మధ్య శాంతి, స్థిరత్వం కోసం, కశ్మీర్ కేంద్రంగా ఉన్న అన్ని సమస్యలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి. అణ్వాయుధాలను ప్రమాదవశాత్తు లేదా అనధికారి కంగా ఉపయోగించడాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి.
లాహోర్ చర్చల సమయంలోనే అది నచ్చని ఆ దేశ సైనిక ప్రధానాధికారి పర్వేజ్ ముషార్రఫ్ కుట్రకు తెర లేపారు. ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’గా పిలిచే ముషార్రఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అజీజ్‌ఖాన్, కోర్ కమాండర్ జనరల్ మెహమూద్, ఉత్తర ప్రాంత పదాతిదళ కమాండర్ జావెద్ హసన్ కలిసి వ్యూహం రచించారు. దీనికి ‘ఆపరేషన్ బ్ర’ అని రహస్య పేరు పెట్టారు. దీని లక్ష్యం కశ్మీర్, లడఖ్ ప్రాంతాలను విడదీసి, భారత సైన్యాన్ని సియాచిన్ నుండి వెనక్కి పంపడం, భారత్‌ని కశ్మీర్ సరిహద్దు పరిష్కారం పేరుతో ఇరుకున పెట్టడం. కశ్మీర్ సమస్య అంతర్జాతీయ వేదికల మీదకు చేరాలన్నది కూడా వారి ఉద్దేశం.
లద్దాక్‌లోని గార్కల్ గ్రామానికి చెందిన తాషీనామ్ గ్యాల్ అనే బౌద్ధ పశువుల కాపరికి చెందిన యాక్ (జడల బర్రె) తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ సరిహద్దులకు వెళ్లాడు. అంతకు ముందురోజు అంటే 1999 మే 3వ తేదీన పాకిస్తాన్‌కు చెందిన 6 నార్తర్న్ లైట్ ఇన్ఫాంట్రీ సైనికులు దాదాపు 1700 మంది ముజాహిద్దీన్ల ముసుగులో సరిహద్దు దాటి 8 కిలోమీటర్ల లోనికి చొరబడ్డారు. పాక్ ఎస్ఎస్జి, సెవెన్ నార్త్ లైట్ ఇన్ఫాంట్రీ బెటాలియన్లు, కశ్మీర్ ఉగ్రవాద మూకల చొరబాటుదారులు, అఫ్ఘాన్ కిరాయిమూకల సహాయంతో ఈ ఎత్తైన పోస్ట్‌లను ఆక్రమించు కున్నాయి. లెప్ాను శ్రీనగర్ నుంచి వేరుచేయడం ద్వారా వాస్తవాధీన రేఖ రూపురేఖలను మార్చాలన్నది వారి లక్ష్యం. సాధారణంగా సరిహద్దుల వెంట పాకిస్తాన్ తరచూ కాల్పులు జరుపుతూనే ఉంటుంది. దీటుగా భారత సైన్యం కూడా ఎదురు కాల్పుల ద్వారా సమాధానం ఇస్తుంది. ఈ కాల్పుల చాటునే చొరబాటుదార్లు పెద్ద సంఖ్యలో ప్రవేశించారు. పాక్ కాల్పుల్లో భారత గస్తీ దళానికి చెందిన ఓ జవాను మరణించాడు. తాషీనామ్ గ్యాల్ సరిహద్దుకు దూరం నుంచి బైనాక్యులర్ ద్వారా చూస్తే అనుమానిత వ్యక్తులు కనిపించారు. వారు తన యాక్‌ను చంపి తిన్నారని గ్రహించాడు. వెంటనే భారత గస్తీ దళాలకు సమాచారాన్ని అందించారు.
భారత సైన్యం మొదట సమస్య తీవ్రతను గ్రహించలేకపోయింది. మే 5వ తేదీన మన సైన్యం కెప్టెన్ సౌరబ్ కాలియా నాయకత్వంలో ఐదుగురు సైనికుల గస్తీ దళాన్ని ఆ ప్రాంతానికి పంచించింది. పాక్ సైన్యం వీరిని చంపేసింది. కానీ అది తీవ్రవాదుల పని అన్నట్లుగా పాకిస్తాన్ నమ్మించే ప్రయత్నం చేసింది.
అదే సమయంలో ముషార్రఫ్, అజీజ్‌లు కార్గిల్ ప్రాంతంలోని సైనికుల గురించి మాట్లాడుకున్న ఆడియో టేపులను భారత సైన్యం ఛేదించింది. ద్రాస్, కక్సార్, ముషో సెక్టార్లలో చొరబాట్లు జరిగాయని గ్రహించింది. ఈలోగా మే 9న పాకిస్తాన్ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది. పరిస్థితి తీవ్రత అర్థమైపోయింది. కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించింది పాకిస్తాన్ సైన్యమేనని స్పష్టమైంది.
పాకిస్తాన్ దురాక్రమణ వార్త తెలియగానే ప్రధాని వాజపేయి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఫోన్ చేశారు. ‘మీరు నాతో చాలా దారుణంగా వ్యవహ రించారు. లాహోర్‌లో నన్ను హత్తుకుంటూనే, మీవాళ్లను కార్గిల్ ఆక్రమణ కోసం పంపిస్తున్నారు..’ అన్నారు. నవాజ్ షరీఫ్ తనకు ఆ విషయం తెలీదన్నారు. పర్వేజ్ ముషార్రఫ్‌తో మాట్లాడి మళ్లీ ఫోన్ చేస్తాను అన్నారు. అప్పుడు వాజపేయి, ‘నా పక్కనే ఓ పెద్దమనిషి ఉన్నారు, ఆయనతో మాట్లాడతారా?’ అన్నారు. ఆ పెద్దమనిషి బాలీవుడ్ ప్రముఖుడు దిలీప్ కుమార్. ఫోన్లో దిలీప్ కుమార్ గొంతు వినగానే నవాజ్ హతాశయులయ్యారు. ‘షరీఫ్ సాబ్! మీరిలా చేస్తారని నేనసలు అనుకోలేదు. ఎందుకంటే మీరెప్పుడూ భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి గురించే మాట్లాడేవారు. భారత్-పాక్ మధ్య ఎప్పుడు ఉద్రిక్తతలు తలెత్తినా ఇక్కడి ముస్లింలు అభద్రతా భావంలో పడతారు. వారికి ఇళ్లలోంచి బయటికి వెళ్లడం కూడా కష్టమైపోతుంది’’ అన్నారు దిలీప్ కుమార్ (పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కసూరీ తన ఆత్మకథ ‘నైదర్ ఎ హాక్ నార్ ఎ డోవ్’లో ఈ కథనం రాశారు). వెంటనే ప్రధాని, రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్, భారత సైన్యాధ్యక్షుడు వేద్ప్రకాష్ మాలిక్ సమావేశమై సైన్యాన్ని సిద్ధం చేశారు.
ఆ తర్వాత మన సైనిక బలగాలు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. శత్రు సైన్యం ను తరిమి తరిమి కొట్టాయి. కార్గిల్ లో విజయకేతనం ఎగురవేశాయి.