ప్రధాని నరేంద్ర మోదీ వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. గురువారం నాడు పురులియా జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. అధికార పార్టీ టీఎంసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఎంసీ పార్టీ భారీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపణలు గుప్పించారు. అసలు టీఎంసీ పార్టీ పూర్తి పేరు ట్రాన్స్ఫర్ మై కమిషన్ అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే కమిషన్ ఇస్తేనే టీఎంసీ పార్టీ ఏ పనైనా చేస్తుందని.. కానీ బీజేపీ మాత్రం డీబీటీ తరహాలో పనిచేస్తుందన్నారు. డీబీటీ అంటే డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటూ మోదీ వెల్లడించారు. తాము నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు జమా చేస్తున్నామని.. కానీ మమతా బెనర్జీ పార్టీ మాత్రం కమిషన్లకు అడ్డాగా మారిందంటూ ఆరోపించారు. తాము రైతుల అకౌంట్లలో బీజేపీ సర్కార్ నేరుగా డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తుందన్నారు. బెంగాలీ ప్రజలు టీఎంసీ ప్రభుత్వంతో పని లేదని చెప్పినా అర్ధం కావడం లేదని.. లోక్‌సభలోనే సగం స్థానాలను బీజేపీ దక్కించుకుందని.. ఇక ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు ప్రధాని మోదీ. అంతేకాదు మే 2వ తేదీన వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
కాగా, మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో గాయపడ్డ సంఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. దీదీ కాలికి గాయమైనప్పుడు.. తాను చింతించినట్లు ప్రధాని చెప్పుకొచ్చారు. ఆమె కాలికి అయిన గాయం త్వరగా నయం కావాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.