బాలికపై టీఎంసీ నేత కుమారుడి అత్యాచారం, హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మంగళవారు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ రాష్ట్రశాఖ. ఉదయం ఆరు గంటలనుంచి మొదలైన బంద్ సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగనుంది.
ఈనెల 4న నదియా జిల్లా హన్స్ ఖలీకి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానిక పంచాయతీ సభ్యుడి కుమారుడి పుట్టినరోజు వేడుకకు హాజరైంది. మధ్యాహ్నం ఆరోగ్యంగా పార్టీకి వెళ్లిన బాలిక సాయంత్రం అచేతన స్థితిలో ఇల్లుచేరింది. తల్లి ఆస్పత్రికి తరలిస్తుండగానే కన్నుమూసింది. ఇంటికి వస్తూనే బాలికకు రక్తస్రావం అయిందని.. కడుపునొప్పి భరించలేకపోతున్నానంటూ కిందపడిపోయిందని తల్లి అంటోంది. అయితే స్థానిక టీఎంసీ నాయకుడి కొడుకు, అతని స్నేహితులు ఆమెపై అత్యాచారం చేశారని ఆమె స్నేహితులు బాలిక తల్లికి చెప్పారు.
బాలిక చనిపోయిన వెంటనే అంత్యక్రియలు చేయాలని నిందితుడి కుటుంబసభ్యులు ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. కానీ బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ను వెనక్కి తీసుకెళ్లాలని వాళ్లు బెదిరించినట్టు ఆమె వాపోతోంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. టీఎంసీ నేత సమర్ గోలీ, అతని కుమారుడు సోహెల్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలైంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)