అమర్నాథ్ యాత్రకు మూడు రోజుల ముందు ఈరోజు ఉదయం జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) పాకిస్తాన్ చొరబాటుదారుని కాల్చి చంపింది. BOP బక్వార్పూర్లో ప్రాంతంలోని కంచె మీదుగా అనుమానాస్పద కదలికలను రాత్రి సుమారు 12.10 గంటలకు BSF దళాలు గమనించినట్లు BSF ఒక ప్రకటనలో తెలియజేసింది.
“రాత్రి సమయంలో ఒక వ్యక్తి కంచె దాటాలనే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ వైపు నుంచి కంచె వైపు దూకుడుగా వస్తున్నట్లు గమనించాం. BSF అతన్ని ఆగమని సవాలు చేసింది, కానీ అతను దానిని పట్టించుకోలేదు.. కంచె వైపు తన కదలికను కొనసాగించాడు” అని ప్రకటనలో పేర్కొంది. BSF దళాలు చొరబాటుదారుడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాయని, దీని కారణంగా అతను ఫెన్సింగ్‌కు ముందు వెంటనే కిందపడిపోయాడని పేర్కొంది. తెల్లవారుజామున BSF ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయగా, కంచెకు అతి సమీపంలో పాకిస్తాన్ చొరబాటుదారుడి మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని తదుపరి చర్యల కోసం పోలీసులకు అప్పగిస్తున్నట్లు పేర్కొంది.
మరోవైపు దోడా పోలీసులు భద్రతా బలగాలతో కలిసి ఓ ఉగ్రవాదిని ఈరోజు అరెస్టు చేశారు. అరెస్టయిన ఉగ్రవాదిని కోటి దోడా నివాసి ఫరీద్ అహ్మద్‌గా గుర్తించారు. అతడి వద్ద నుంచి ఒక చైనీస్ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.