తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఈడీ గండం వెంటాడుతోంది. కాంగ్రెస్ అగ్ర నాయకుల్ని అనకొండలా చుట్టేస్తున్న నేషనల్ హెరాల్డ్ స్కామ్ దర్యాప్తులో ఇప్పుడు రేవంత్ పేరు బయటకు వచ్చింది. ఈ స్కామ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లకు భాగస్వామ్యం ఉందని చెబుతున్నారు. డెక్కన్ హెరాల్డ్, ఎకనామిక్స్ టైమ్స్ వంటి జాతీయ ఇంగ్లీషు దినపత్రికలు ఈ విషయాన్ని ప్రచురించాయి. ఆ పత్రికల కథనాల ప్రకారం.. రేవంత్ రెడ్డి పేరుని ఈడీ ఛార్జి షీటు లోకి చేర్చినట్లు కూడా తెలుస్తోంది.
…
నిజానికి, నేషనల్ హెరాల్డ్ స్కామ్ లో వేల కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగింది. దీనికి అనుబంధంగా కాంగ్రెస్ చందాల విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ సంస్థ.. డబ్బుల వసూళ్లలో కీలకంగా నిలిచింది. ప్రతీ రాష్ట్రంలోనూ గాంధీ భవన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులకు ముందుగానే సూచన వెళ్లిపోయింది. ఈ సూచన ప్రకారం.. ఎన్నికలకు ముందు యంగ్ ఇండియా సంస్థ కోసం భారీగా చందాలు వసూలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ కావాలన్నా, పార్టీలో పదవులు కావాలన్నా యంగ్ ఇండియా సంస్థ కు విరాళాలు చెల్లించాల్సిందే. కోట్లలో చెల్లించిన ఈ చందాలను లంచాలు అని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి.
……
ఇందుకు సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలు కూడా సంపాదించింది. యంగ్ ఇండియన్‌కు డొనేషన్ ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్గంభీర్కు ముఖ్యనేతలు ఒత్తిడి తెచ్చారు. ఏఐసీసీ కార్యవర్గంలో చోటు కల్పించడంతోపాటు,, మండి లోక్‌సభ స్థానం టికెట్ ఆయన అల్లుడికి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారు. దీంతో ఆయన లక్షల్లో సమర్పించుకున్నారు. అయితే తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో డబ్బులు వాపస్ ఇవ్వాలని ఆయన ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాశారు. అలాగే.. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఒత్తిడితో యంగ్ ఇండియన్‌కు 50 లక్షలు ఇచ్చినట్టు గుజరాత్‌కు చెందిన అర్వింద్ విశ్వనాథ్‌సింగ్ చౌహాన్ ఆరోపించారు. తన బ్యాంకు ఖాతానుంచి 30 లక్షలు బదిలీ చేయగా, మరో 20 లక్షలు నగదు రూపంలో ఏఐసీసీ కార్యాలయంలో అందజేశారు. ఈ విషయాలన్నీ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో చౌహాన్ పేర్కొన్నారు. ఇటువంటి ఫిర్యాదులతో ఈడీ దర్యాప్తు వేగం పుంజుకొంది.
……
జాతీయ ఇంగ్లీష్ దినపత్రికల కథనం ప్రకారం.. ఇదే మాదిరిగా తెలంగాణ లో కూడా వసూళ్ల పర్వం సాగిందని ఈడీ చెబుతోంది. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి భారీగా డబ్బులు వసూలు చేయించారని చెబుతున్నారు. యంగ్ ఇండియా కు కోట్లలో చందాలు ఇచ్చిన వారికే టిక్కెట్లు దక్కాయి అన్నది ఆరోపణ. అటు కర్నాటక లో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డీకే శివకుమార్ మీద కూడా ఇటువంటి ఆరోపణలే వస్తున్నాయి. దక్షిణ భారత దేశం అంతటిలోనూ,, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ టిక్కెట్లకు గిరాకీ ఎక్కువ. ఈ డిమాండ్ ను ద్రుష్టిలో పెట్టుకొని భారీగా చందాలు వసూలు చేశారన్నది ఈడీ ఆరోపణ. ఈ ఆరోపణల ఆధారంగా రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ల మీద ఈడీ ఛార్జిషీట్ వేసినట్లు జాతీయ పత్రికల్లో రాశారు.
…
దీని మీద కాంగ్రెస్ పార్టీ కానీ, ఈడీ కానీ ఇప్పటి దాకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.