భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 15 రోజులపాటు సాగే ఈ ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఉత్సవాలు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో జరుగుతున్నాయి. ఈరోజు ఉత్సవ ప్రారంభం సందర్బంగా సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు సహా ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అనేక త్యాగాలు, పోరాటాల వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. మహాత్ముడి దేశంగానే భారత్ ఉంటుందని చెప్పారు. కొంతమంది గాంధీని కించపరచాలని చిల్లర ప్రయత్నాలు చేస్తున్నపటికీ అవి ఫలించవన్నారు.
దేశంలో మహాత్మా గాంధీని అవమానించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. భారతమాతకు సమానంగా గౌరవం ఇవ్వాల్సిన వ్యక్తిని కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహాత్ముడు ఎప్పటికైనా మహాత్ముడే అని అన్నారు. పేదరికం ఉన్నంత కాలం అలజడులు ఉంటాయని.. ప్రజల ఆకాంక్షలు ఇంకా పూర్తిగా నెరవేరలేదని కేసీఆర్ పేర్కొన్నారు. జాతిని చీల్చే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే దేశం కోసం ముందుండి పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.