రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా కేంద్రబడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో మోదీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడారు. గత ఏడేళ్లలో తాము తీసుకున్న నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతూ వచ్చిందన్నారు ప్రధాని. అంతకుముందు లక్షా 10వేల కోట్లుగా ఉన్న జీడీపీ.. ప్రస్తుతం 2లక్షల 30వేల కోట్లు దాటిందని తెలియజేశారు. వ్యవసాయరంగాన్ని ఆధునీకరించేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు మోడీ. ప్రభుత్వ చర్యల ఫలితంగా దేశ ఎగుమతులు 4.7 లక్షల కోట్లుకు చేరాయని వివరించారు. భారత దేశాన్ని ఆధునికత దిశగా నడిపించే అనేక ముఖ్యమైన అంశాలు ఈ బడ్జెట్లో ఉన్నాయన్న ఆయన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రభుత్వ విధానాలన్నిటినీ నిర్మల సీతారామన్ సమగ్రంగా వివరించారని ఆయన కొనియాడారు.
ఏడేళ్ళ క్రితం భారత దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రూ.1,10,000 కోట్లు కాగా నేడు రూ.2,30,000 కోట్లకు చేరిందని ప్రధాని పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 200 బిలియన్ డాలర్ల నుంచి 630 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆయన తెలిపారు. వీటన్నిటికీ కారణం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర విధానాలేనని ప్రధాని వివరించారు. బడ్జెట్ ప్రధానంగా పేదలు, మధ్య తరగతి వర్గాలు, యువతకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టిందని ప్రధాన మంత్రి చెప్పారు.
కరోనా మహమ్మారి తర్వాత సరికొత్త ప్రపంచం ఆవిర్భవిస్తోందని…ఇవాళ భారతదేశం పట్ల ప్రపంచం చూసే దృక్పథం చాలా మారిందని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించడంపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టిందని…సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు. దీనివల్ల వ్యవసాయం మరింత ఆకర్షణీయంగా మారుతుందని చెప్పారు. రైతులకు సరసమైన ధరలకు కిసాన్ డ్రోన్లను, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తామని చెప్పారు.దేశ సరిహద్దుల్లోని గ్రామాల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెబుతూ సరిహద్దుల్లోని గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో ఎన్సీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు మోదీ.