తనపై జారీ అయిన అరెస్ట్ వారెంట్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కు కోర్టు మొట్టికాయలు వేసింది. ఈ దేశ యువతరం మనసులను కలుషితంచేస్తున్నారని సుప్రీం కోర్టు మండిపడింది. ఆమె ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్ XXX ట్రిపుల్ ఎక్స్ అభ్యంతరకరమైన కంటెంట్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏక్తా కపూర్ నేతృత్వంలోని ఓటీటీ ప్లాట్‌ఫాం ఆల్ట్‌బాలాజీ (ALTBalaji)లో XXX వెబ్ సిరీస్ ప్రసారమవుతోంది. ట్రిపుల్ ఎక్స్ సీజన్ -2లో ఓ సైనికుని భార్యకు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని శంభు కుమార్ అనే మాజీ సైనికుడు 2020లో ఫిర్యాదు చేశారు. సైనికులు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై బిహార్‌లోని బేగుసరాయ్ ట్రయల్ కోర్టు ఏక్తా కపూర్‌ను అరెస్టు చేసేందుకు వారంట్లు జారీ చేసింది. అయితే అరెస్ట్ వారెంట్లను సవాల్ చేస్తూ ఏక్తాకపూర్ సుప్రీంను ఆశ్రయించారు. ఆమె తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తాము పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అది త్వరగా విచారణకు వస్తుందని అనుకోవడం లేదని..ఇలాంటి కేసులో గతంలో సుప్రీం ఆమెకు ఉపశమనం కల్గించిందని గుర్తు చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫాంపై ప్రసారమవుతున్న కంటెంట్ సబ్స్క్రిప్షన్ ఆధారితమైనదని..ప్రేక్షకులకు తమకు నచ్చిన కంటెంట్ ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందనీ అన్నారు. ఈ వాదనపై కోర్టు మండిపడింది. ఈ దేశ యువతరం మనసులను మీరు కలుషితం చేస్తున్నారని ఓటీటీ ద్వారా వెబ్ సిరీస్ అందరికీ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
https://twitter.com/AdvAshutoshBJP/status/1580890046429016070?s=20&t=FqgjYNS6larAsyfYgMVgGg
‘‘మీరు ప్రతిసారీ ఈ కోర్టుకు వచ్చేస్తున్నారు. దీనిని సమర్థించలేం. ఇలాంటి పిటిషన్లను దాఖలు చేస్తున్నందుకు జరిమానా విధిస్తాం. రోహత్గీ గారూ, మీ క్లయింటుకు ఈ విషయాన్ని చెప్పండి. మంచి న్యాయవాదుల సేవలను పొందగలుగుతున్నారనే కారణంతో, నోరున్నవారి కోసం ఈ కోర్టు లేదు’’ అని రోగత్గీపైనా అసహనం వ్యక్తం చేసింది.
ఈ పిటిషన్‌పై విచారణను పెండింగ్‌లో పెడుతూ, హైకోర్టులో విచారణ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి స్థానికంగా న్యాయవాదిని పెట్టుకోవాలనీ కోర్టు సలహా ఇచ్చంది.