సీఎం కేసీఆర్ మునుగోడు సభ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మునుగోడులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజాదీవెన సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను కేసీఆర్ టార్గెట్ చేశారు. ఇది ప్రజాస్వామ్య దేశమని.. రాచరిక వ్యవస్థ కాదని అన్నారు. బీజేపీ వాళ్లకు ఎందుకింత అహంకారమని మండిపడ్డారు. బెంగాల్ లో మమత సర్కార్ ను పడగొడతానని ప్రధాని అంటున్నారని.. మోదీని అహంకారమే పడగొడుతుందని విమర్శించారు. కృష్ణానది జలాలను ట్రిబ్యునల్ కు రిఫర్ చేయమంటే మోదీ చేయలేదని తప్పుబట్టారు. తమ ప్రశ్నలకు అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడులో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్లు కూడా రాలేదన్నారు.
అంతే కాకుండా లెఫ్ట్ పార్టీలు కూడా తమతో కలిసి వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. ప్రగతిశీల, క్రియాశీల శక్తులన్నీ ఏకం అవుతున్నాయి. ఇవాళ సీపీఐ కలిసొచ్చింది. రేపు సీపీఎం కూడా కలిసొస్తుందని కేసీఆర్ అన్నారు.
ఈడీతో దాడులు చేయించినా భయపడేది లేదని అన్నారు. దొంగలు, లంగలు భయపడతారు.. నేను భయపడతానా? అని అన్నారు. మీరు గోకినా, గోకకున్నా.. నేను గోకుతా.. నిన్ను పడగొట్టే వాళ్ళు లేరనుకున్నారా? బీజేపీ వాళ్ళను తరిమికొట్టాలని కేసీఆర్ అన్నారు. రైతుబంధు, పింఛన్లు ఎందుకు ఇస్తున్నారని మమ్మల్ని నిలదీశారు. రైతులకు అనవసరంగా డబ్బులు పంచిపెడుతున్నామని అంటున్నారు. సంక్షేమ పథకాలు బంద్ పెట్టాలని అంటున్నారు. మీటర్లు పెట్టే బీజేపీ కావాలా?.. మీటర్లు వద్దనే టీఆర్ఎస్ కావాలా? అని ఎద్దేవా చేశారు.
బావుల దగ్గర మీటర్ పెట్టు కేసీఆర్ అంటున్నారు. చచ్చినా పెట్టనని కేంద్రానికే చెప్పా. ఎరువుల ధరలు పెంచాలి, కరెంట్ రేటు పెంచాలి. మోదీ పాలనలో పండిన పంటలకు ధర రాదు. మోదీ సన్నిహితులు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారన్నారు. మునుగోడులో గోల్మాల్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఎవరి కోసం ఈ ఉప ఎన్నిక.. ఇక్కడ ఉప ఎన్నిక రావాల్సిన అవసరం ఏముందని సీఎం ప్రశ్నించారు. మునుగోడు సభలో కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు.. కానీ కేసీఆర్ అభ్యర్థి ప్రస్తావనే తీసుకురాకుండా సభను ముగించారు.