దేశమంతా పార్లమెంట్ కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వంటి చోట శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకసారి ఓటు వేసిన తర్వాత మరోసారి రాకుండా ఉండేందుకు చూపుడువేలు మీద సిరాముద్ర కూడా వేస్తారు. ఇదంతా సహజంగా జరిగేదే.
కానీ, ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతంలో ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది.
ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దుల్లోని కొఠియా గ్రామాల గిరిజనులు సోమవారం జరగబోయే ఎన్నికల్లో రెండు చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడి 21 గ్రామాల గిరిజనులకు రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లున్నాయి. ఇరు రాష్ట్రాల అంగీకారంతోనే కొన్ని దశాబ్దాలుగా రెండేసి ఓట్లు వేస్తున్నారు.
కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితిలో కొఠియా పంచాయతీ ఉంది. ఈ ప్రాంతం ఒడిశా రికార్డుల్లో, ఆంధ్రాలోని మన్యం జిల్లా సాలూరు మండలం రికార్డుల్లోనూ ఉంది.
గతంలో ఒడిశాల ఒకరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఒకరోజు పోలింగ్ జరిగేది అప్పుడు రెండు చోట్ల పోలింగ్ ఏర్పాట్లు చేసేవారు గిరిజనులు అక్కడ ఒకరోజు ఇక్కడ ఒక రోజు ఓటు వేసుకునేవారు.
కానీ, మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాలకు ఒకేరోజు ఉండడంతో ఇక్కడ పోలింగ్ నిర్వహణ కత్తి మీద సాములా మారింది. నాడు బ్రిటిష్ వారు చేసిన తప్పు కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఈ గ్రామాలు కొన్ని దశాబ్దాలుగా వివాదంలో చిక్కుకున్నాయి. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది. 1996లో మధ్యంతర ఎన్నికల సమయంలో ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాలకు ఒకేరోజు ఎన్నికలు జరగ్గా, అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండు రాష్ట్రాలకు చెందిన కలెక్టర్ల పరస్పర చర్చలతో వేరే ఇంకులు ఉపయోగించడంతో గిరిజనులు రెండుచోట్ల ఓటు వేశారు. మళ్లీ ఇప్పుడు ఒకేరోజు పోలింగ్ జరగడంతో ఉత్కంఠ నెలకొంది.
ఇద్దరు ఎంపీలు…. ఇద్దరు ఎమ్మెల్యేలు
ఈ 21 గ్రామాల గిరిజనులకు ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలుంటారు. ఒడిశాలో కొరాపుట్ లోక్‌సభ, పొట్టంగి అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తారు. అలాగే, ఆంధ్రాలోని అరకు లోక్‌సభతోపాటు సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొఠియా గ్రామాలున్నాయి. అరకు లోక్‌సభ స్థానం నుంచి 13 మంది, సాలూరు ఎమ్మెల్యే స్థానానికి ముగ్గురు, కొరాపుట్ లోక్‌సభ స్థానం నుంచి 10 మంది, పొట్టంగి నియోజకవర్గంలో 9 మంది పోటీ చేస్తున్నారు. ఆంధ్రా నుంచి 2,554 మంది ఓటర్ల కోసం నేరేడివలస, శిఖపరుపు, కుర్కుటిల్లో, ఒడిశా నుంచి 5,502 మంది ఓటర్ల కోసం కొఠియా, గంజాయి పొద్రొ, పట్టు చెన్నేరు, మద్కర్, నేరేడి వలస, రణసింగ్, టౌపొద్ర, గల్లిగబ్దర్, గేమెల్ పోద్రొల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
దీంతో గిరిజనులు సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నారు ఉదయం పూట ఒడిశాలో ఓటు వేసి వచ్చాక మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇందుకు తగినట్లుగా సరిహద్దు గ్రామాల్లో అధికారులు కూడా సమన్వయం చేసుకుంటున్నారు.