తాలిబన్ల చెరలోకి వెళ్లిన ఆఫ్గన్ పౌరుల ఆవేదన వర్ణనాతీతం. చీకటి రోజులనుంచి పూర్తిగా బయటపడ్డాం అనుకుంటున్న తరుణంలోనే మరోసారి తాలిబన్లు వారిని చీకట్లోకి నెట్టేశారు. ఇప్పటికే ఓ తరాన్ని నష్టపోయాం…తమ పిల్లలనైనా కాపాడుకోవాలన్న ఆవేదన వారి మాటలు, కళ్లల్లో కనిపిస్తోంది. కాబూల్ విమానాశ్రయం చుట్టూ పెట్టిన కంచెలపైనుంచి తమ పిల్లల్ని ఎయిర్ పోర్టులోకి విసిరేస్తున్నారు. వీరినైనా కాపాడండి..ఇక్కడినుంచి తీసుకెళ్లండి అంటూ అమెరికా, బ్రిటన్ సైనికులకు మొరపెట్టుకుంటున్నారు.
ఆఫ్గన్లో చిక్కుకుపోయిన తమ వాళ్లను తీసుకొచ్చేందుకు అమెరికా, యూకే ప్రభుత్వాలు ప్రత్యేక బలగాల్నిపంపాయి. కాబూల్ విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకున్న రెండుదేశాలూ అక్కడ పహారా కాస్తున్నాయి. అయితే తాలిబన్ల పాలనలో భయాందోళకు గురవుతున్న ఆప్ఘన్ వాసులు పెద్దఎత్తున దేశం విడిచిపోయేందుకు ఎయిర్ పోర్టుకు తరలివస్తున్నారు. దీంతో అక్కడ కంచె ఏర్పాటు చేసి గేటులు మూసివేశారు.
అయితే అక్కడకు వస్తున్న కొందరు మహిళలుఇనుప కంచెల పైనుంచే పిల్లలను విసిరేసి విదేశీ దళాలను పట్టుకోమని అడుగుతున్నారు. ఈ క్రమంలో కొందరు చిన్నారులు కంచెలో చిక్కుకుంటున్నారు అని…ఆ దృశ్యాలు తమను ఎంతగానో కలచివేస్తున్నాయని స్వయంగా సైనికాధికారులు కన్నీళ్లు పెడుతూ చెప్తున్నారు.