బాలగంగాధర తిలక్‌ని భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు. జాతీయోద్యమంలో మహాత్మాగాంధీకి ముందు తరం నాయకుల్లో ఆయన ఒకరు. స్వాతంత్య్రోద్యమ తొలినేత అయిన లోకమాన్య.. తన ప్రసంగాలతో నాటి యువతలో స్ఫూర్తి రగిలించారు.
స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించి, దాన్ని ఎప్పటికైనా సాధించి తీరుతానంటూ శపథం చేసిన ముందుకు సాగిన మహనీయుల్లో ప్రాతఃస్మరణీయుల్లో మొదటి వారు తిలక్
జాతీయవాదిగా, సామాజికవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించి.. sదేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని భారతజాతీయోద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన చెప్పుకోదగిన పాత్ర పోషించారు. అందుకే ఆయనను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడుగా భావిస్తారు.
బాలగంగాధర్ తిలక్ బాల్యం – విద్య
బాలగంగాధర తిలక్ 1856 జూలై 23వ తేదీన మహారాష్ట్రంలోని రత్నగిరిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.తన బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రంలో అతను విశేష ప్రతిభ కనబరచేవాడు. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు
ఆయన తండ్రి గంగాధర్ శ్రీ గంగాధర తిలక్ మరియు తల్లి పేరు పరవతీ బాయి గంగాధర్. ఆయన తండ్రి ఒక సంస్కృత పండితుడు, ఉపాధ్యాయుడు. చిఖాలి బాల గంగాధర్ తిలక్ పూర్వీకుల గ్రామం.
తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు అతను తండ్రికి రత్నగిరి నుంచి పుణెకు బదిలీ అయింది. తిలక్ పూణేలోని దక్కన్ కళాశాలలో విద్యనభ్యసించాడు, అక్కడ 1876లో ఆయన గణితం మరియు సంస్కృతంలో బ్యాచిలర్ డిగ్రీలను పొందారు. తిలక్ తరువాత న్యాయశాస్త్రం అభ్యసించారు.
అయితే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయారు. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే ఆయనకు సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది.
1879లో బొంబాయి విశ్వవిద్యాలయం (ఇప్పుడు ముంబై) నుండి డిగ్రీని పొందారు . అయితే, ఆ సమయంలో,ఆయన పూనాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో గణితాన్ని బోధించాలని నిర్ణయించుకున్నారు. ఆ పాఠశాల ఆయన రాజకీయ జీవితానికి ఆధారం అయింది. ఆయన సంస్థను స్థాపించిన తర్వాత.. ఆ సంస్థను విశ్వవిద్యాలయ కళాశాలగా అభివృద్ధి చేశారు.
వృత్తి – ఇతర కార్యక్రమాలు
చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయన సహజగుణం.భారతీయతకు ప్రతీక ఆధునిక భావాలతో కళాశాల విద్య అభ్యసించిన తిలక్, ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు.
పాశ్చాత్య విద్యావిధానం వల్ల భారతీయుల్లో సంస్కృతి పట్ల అవగాహన కొరవడిందని, అది భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కించపరిచేలా ఉందనే ఉద్దేశంతో బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం ఆయనది.
ప్రతి భారతీయుడికి సంస్కృతి గురించి, దేశ ఔన్నత్యాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం.దీని కోసం అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ లతో కలిసి ‘డక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ స్థాపించారు.
ఆ తరువాత తాను నడిపిన పత్రికలు “మరాఠా (ఆంగ్ల పత్రిక)”, “కేసరి (మరాఠీ పత్రిక)” లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా రాశాడు.
వాక్ స్వాతంత్య్రం, భారతీయ సంస్కృతి పట్ల బ్రిటిష్ పాలకులు చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై.. ఆయన యుద్ధం ప్రకటించారు.
భారతీయ సంస్కృతిపై బ్రిటిష్ నాయకుల అణచివేతను 1857 తిరుగుబాటు తరువాత అంతగా నిరసించిన వ్యక్తిగా ఆయన పేరు చెప్పుకోవాలి. జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని తిలక్ వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు తిలక్ ప్రారంభించినవే.
భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేశ పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. ఇవన్నీ స్వరాజ్య సాధనకు ప్రభావిత మాధ్యమాలుగా మారాయి. ఇవే తిలక్‌కు స్వాతంత్య్ర సంగ్రామంలో ఓ ప్రాధాన్యత కల్పించాయి.
ఇదిలా ఉంటే.. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే, 1906లో, దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే అతను గీతారహస్యం అనే పుస్తకం రాశాడు
బాల గంగాధర తిలక్ భారత స్వాతంత్ర్య ఉద్యమం
బాల గంగాధర్ తిలక్ సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడిపారు. ఆయన రాజకీయ జీవితం 19వ శతాబ్దం చివరలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చురుకైన సభ్యుడిగా మారడంతో ప్రారంభమైంది.దీనిలో ఆయన బ్రిటిష్ పాలన నుండి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడారు. గాంధీజీ కంటే ముందు ఆయన అత్యంత ప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు. మతపరమైన మరియు సాంస్కృతిక పునరుద్ధరణను నొక్కి చెప్పడం ద్వారా.. ఆయన స్వాతంత్ర్యం కోసం ఒక సామూహిక ఉద్యమాన్ని ప్రారంభించారు.
1890లో, తిలక్ భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడయ్యాడు. ముఖ్యంగా స్వపరిపాలన కోసం పోరాటంలో దాని మితవాద వైఖరిని ఆయన వ్యతిరేకించాడు. లాలా లజపతి రాయ్ మరియు బిపిన్ చంద్ర పాల్ వంటి ఇతర తీవ్రవాద నాయకులతో పాటు.. ఆయన స్వరాజ్ (స్వయం పాలన) కోసం వాదించారు.తిలక్ విధానం భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మితవాద నాయకులకు పూర్తి విరుద్ధంగా ఉంది.
స్వాతంత్ర పోరాటంలో తిలక్ అనేకమార్లు జైలుకు వెళ్లారు. ఏ దశలోనూ జైలు గదులు ఆయన స్వరాజ్య నినాదాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆయనను జైల్లో బంధించడాన్ని రాజనీతిజ్ఞులంతా వ్యతిరేకించి, విడుదల చేయమంటే- ఉత్సవాల్లో పాల్గొనకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదనే ఆంక్షలను నాటి ప్రభుత్వం ఆయన ముందుంచింది.
అయితే, పిరికివాడిగా బతకడం కంటే అండమాన్ జైలులో ఉండటమే మేలని నాడు ఆయన చెప్పిన మాటలు యావత్ దేశాన్ని ఉత్తేజపరచాయి.
1900- 1908 మధ్య, లోకమాన్య తిలక్, బిపిన్ చంద్ర పాల్ మరియు లాలా లజపతి రాయ్ నేతృత్వంలో భారతదేశంలో విప్లవాత్మక జాతీయవాదం ఉప్పొంగింది. ఈ నాయకులు భారతీయులలో ఐక్యత మరియు జాతీయతను పెంపొందించారు.
అయితే,1908లో దేశద్రోహ నేరం కింద నాటి బ్రిటిష్ కోర్టు ఆరేళ్ల పాటు ద్వీపాంతర జైలుశిక్ష విధించింది. 1908 నుంచి 1914 వరకు తిలక్, బర్మాలోని మాండలే జైలులో ఉన్నారు. చాలా చిన్న జైలుగదిలో ఒంటరి జీవితం గడిపిన తిలక్, గీతారహస్యం పేరుతో భగవద్గీత మీద గొప్ప వ్యాఖ్యానం రాశారు.
హోమ్ రూల్ ఉద్యమం
1914లో, మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా విడుదలైన తిలక్ మరోసారి రాజకీయాల్లోకి దూసుకెళ్లాడు. “స్వరాజ్యం నా జన్మహక్కు మరియు నేను దానిని పొందుతాను” అనే ఉత్తేజకరమైన నినాదంతో ఆయన హోమ్ రూల్ లీగ్‌ను ప్రారంభించారు.
1916 ఏప్రిల్ లో హోంరూల్ లీగ్‌ని స్థాపించి.. దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగారు. అనీబిసెంటు అదే సంవత్సరం సెప్టెంబర్‌లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది.తిలక్ హిందూ స్వరాజ్య సంఘ్ పేరుతో ప్రభావవంతమైన సంపాదకీయాలను రాశారు, స్వయం పాలన సాధించడానికి ఒక వ్యూహాత్మక ప్రణాళికను వివరించారు.
1918లో, ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అధ్యక్షుడిగా, తిలక్ ఇంగ్లాండ్‌కు ప్రయాణించారు, అక్కడ ఆయన బహిరంగ సమావేశాలు నిర్వహించి బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులతో ముఖ్యమైన సంబంధాలను ఏర్పరచుకున్నారు.
అయితే, కొన్ని కారణాల వల్ల హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది.
సాహిత్య రచనలు
బాలగంగాధర్ తిలక్ వృత్తిరీత్యా జర్నలిస్ట్.
ఆయన “కేసరి” అనే మరాఠీ వార్తాపత్రికలో మరియు “మహ్రత్తా” అనే ఆంగ్ల వార్తాపత్రికలో భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి వ్యాసాలు రాసేవాడు.
అతను శ్రీమద్ భగవద్గీత రహస్య మరియు ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదస్ అనే రెండు పుస్తకాలను రచించాడు.
ఆయన తన “ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ది వేదాస్” అనే పుస్తకంలో వేదాలు ఆర్కిటిక్స్లో మాత్రమే వ్రాయబడి ఉండవచ్చని, చివరి మంచు యుగం తర్వాత ఆర్యులు వాటిని దక్షిణానికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. వేదాల ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించడానికి ఆయన ఒక కొత్త పద్ధతిని సూచించారు.
మండలే జైలులో, తిలక్ ఇలా వ్రాశాడు: “శ్రీమద్ భగవద్గీత రహస్యం”, ఇది వేదాలు మరియు ఉపనిషత్తుల బహుమతిగా పరిగణించబడే భగవద్గీతలోని “కర్మ యోగం” అధ్యయనాన్ని వివరిస్తుంది.
బాల గంగాధర తిలక్ రాసిన ప్రసిద్ధ కోట్స్
స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను!
సమస్య వనరులు లేదా సామర్థ్యం లేకపోవడం కాదు, కానీ సంకల్పం లేకపోవడం.
దేవుడిని అంటరానితనంతో సహిస్తే, నేను ఆయనను దేవుడు అని పిలవను.
మనం ఏదైనా దేశ చరిత్రను గతంలోకి వెతికితే, చివరికి మనం పురాణాలు మరియు సంప్రదాయాల కాలానికి చేరుకుంటాము, అవి చివరికి అభేద్యమైన చీకటిలోకి మసకబారుతాయి.
జీవితం అంతా ఒక పేకాట లాంటిది. సరైన పేకాటను ఎంచుకోవడం మన చేతిలో ఉండదు. కానీ చేతిలో ఉన్న పేకాటతో బాగా ఆడటం మన విజయాన్ని నిర్ణయిస్తుంది.
మరణం
బాలగంగాధర తిలక్ 1920 ఆగస్టు 1న ముంబైలో మరణించారు.ఆయన మరణించినప్పుడు ఆయన్ను “నవభారత నిర్మాత”గా మహాత్మ గాంధీ అభివర్ణించారు.అలాగే, మరియు స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆయనను “భారత విప్లవ పితామహుడు” అని అభివర్ణించారు.
ఇక, తిలక్ తర్వాత ఆయన స్ఫూర్తి స్వాతంత్య్ర ఉద్యమం దిశగా యావత్ భారతాన్ని నడిపించింది. నేటికీ జాతీయవాద స్ఫూర్తిని మనలో నింపుతూనే ఉంది.