పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ‘ది కేరళ స్టోరీ’సినిమా నిషేధాన్ని సుప్రీంకోర్టు నిలిపేసింది. అలాగే ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. భావోద్వేగాలు వాక్ స్వాతంత్ర్యాన్ని నిర్దేశించలేవని వ్యాఖ్యానించింది. సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికేట్ ఇచ్చిందని అలాంటప్పుడు శాంతిభద్రతలు పరిరక్షించే బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.
మే 5న ది కేరళ స్టోరీ విడుదలైంది. యువతులను ట్రాప్ చేసి ఇస్లాంలోకి మార్చి…తరువాత ఉగ్రవాద సంస్థల్లోకి రిక్రూట్ చేస్తున్న పరిస్థితుల్ని అందులో తెరకెక్కించారు. పశ్చిమ బెంగాల్,తమిళనాడు ప్రభుత్వాలు సినిమాను నిషేధించారు. ప్రభుత్వం మే 8న నిషేధం విధించింది. నిషేధాన్ని సవాలు చేస్తూ…నిర్మాణ సంస్థ సన్ షైన్ ప్రొడక్షన్స్ సుప్రీంకెళ్లింది. పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం స్పందన తెలపాలంటూ… మే 12 ఆ రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. ఇకసినిమా ప్రదర్శనను నిలిపేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కేరళ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటిపైనా విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం సినిమా ప్రదర్శనను అడ్డుకుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీసింది. థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ సినిమా నిర్మాత తరపున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ ఏఎం సింఘ్వి, పశ్చిమ బెంగాల్ పోలీసుల తరపున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర నారాయణన్ వాదనలు వినిపించారు.