మసీదుల నుంచి రోజూ ఐదుసార్లు లౌడ్ స్పీకర్లతో వినిపించే శబ్దం చాలా చికాగ్గా ఉందని వ్యాఖ్యానించారు బీజేపీ భోపాల్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ సాధ్వి ప్రగ్యాసింగ్. రోజూ ఉదయం 5 గంటలనుంచి మొదలయ్యే పెద్ద శబ్దం ప్రతిఒక్కరికీ నిద్రాభంగం కలిగిస్తోందని ఆమె అన్నారు. నిద్రలేమితో బాధపడుతున్న రోగులకు ఆ సమయానికే నిద్రపడుతుందని అలాంటిది ఆజా శబ్దం వారిని కలవరపెడుతోందని, బీపీ పెరుగుదల వంటి ఆరోగ్య సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయని అన్నారు.
ముఖ్యంగా తనలాంటి వాళ్లు, సాధువులు ఉదయం నాలుగుగంటలకు ధ్యానం మొదలుపెడతారని.. ఇంచుమించు అదే సమయంలో నమాజ్ పెద్దశబ్దంతో చెవుల్లో మార్మోగుతోందని అన్నారు. అసలైతే అన్ని మతాల విశ్వాసాల్ని గౌరవించేది తాము మాత్రమేనని కానీ లౌడ్ స్పీకర్లతో ఓ వర్గం చాలా ఇబ్బంది పెడుతోందనీ అన్నారు. అయితే ప్రగ్యా వ్యాఖ్యపై అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎంపీ మతాల మధ్య చిచ్చుపెట్టేమాటలు మాట్లాడుతున్నారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేకే మిశ్రా అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు గతేడాది జనవరిలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సిహోర్ జిల్లాలోని పురాతన శివాలయం నుంచి లౌడ్ స్పీకర్ ను తొలగించే ప్రయత్నం చేసింది.
ఇక ప్రగ్యాసింగ్ తాజా ప్రకటనను సమర్థించారు సంస్కృతీ బచావో మంచ్ కు చెందిన చంద్రశేఖర్ తివారీ. లౌడ్ స్పీకర్ల ల్ల ధ్వనికాలుష్యం పెరుగుతోందన్నారు. ఆ స్థాయిలో శబ్దం చేయడం చట్టవిరుద్ధమనీ అన్నారు.
అలాగే నమాజ్ చేయడానికి భోపాల్ కేంద్రీయ విద్యాలయం క్యాంపస్‌ను ఉపయోగించడంపై ప్రగ్యా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు పదిహేనురోజుల క్రితం పాఠశాల క్యాంపస్‌లో నమాజ్ చేస్తున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల క్యాంపస్‌లో సుమారు 300 మంది నమాజ్ చేస్తున్నట్లు తేలింది. కొన్ని ముస్లిం గ్రూపులు వెనక గేట్ల నుంచి వచ్చి స్కూల్ మైదానంలో నమాజ్ చేస్తున్నారని గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. అసలు తల్లిదండ్రులనే క్యాంపస్ లోకి అనుమతించని వారు…నమాజ్ చేసుకునేందుకు బయటివరిని ఆవరణలోకి ఎలా అనుమతిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై అభ్యంతరాలు రావడం ఇది మొదటిసారి కాదు. 2017లో ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. సమీపంలోని మసీదు నుంచి లౌడ్ స్పీకర్ల ద్వారా వచ్చే శబ్దంతో తనకు నిద్రాభంగం అవుతోందని ఆరోపించారు.
ఈ ఏడాది మార్చిలో కూడా యూపీ అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సంగీతా శ్రీవాత్సవ కూడా తన ఇంటి సమీపంలోని మసీదు నుంచి వస్తున్న ఆజా శబ్దాన్ని భరించలేకపోతున్నానంటూ ఫిర్యాదు చేశారు. ఆ శబ్ధం తనకు నిద్రాభంగం కలిగించడంతో పాటు…ఇతర పనులపై ఏకాగ్రత లేకుండా చేస్తోందని…వ్యక్తిగత పనులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని పోలీసు ఉన్నతాధికారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
అసలైతే ఆజా కోసం లౌడ్ స్పీకర్లు వాడడాన్ని నిషేధిస్తూ చాలా కోర్టులు తీర్పునిచ్చాయి. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఉత్తర్వులివ్వడం లేదు. చాలా ప్రాంతాల్లో మసీదుల్లో ఆజా కోసం రోజుకు ఐదుసార్లూ లౌడ్ స్పీకర్లు వాడుతున్నారు.