అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఖరారు అయ్యాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2016 20 మధ్య ఆయన అమెరికా అధ్యక్షునిగా వ్యవహరించారు. ముక్కుసూటి ప్రసంగాలు, దూకుడుగా తీసుకునే నిర్ణయాలతో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. మాట పెళుసు కానీ, పరిపాలనలో సత్తా ఉన్న నాయకుడు అని అమెరికన్లు భావించి పట్టం కట్టారు.
ఆయనతో పోటీ పడ్డ కమలహారిస్ మూలాలు భారతదేశంలోనివే. ఆమె తల్లి పూర్వీకులు తమిళనాడు దగ్గర చిన్న గ్రామానికి చెందినవారు. భారత సంతతి మూలాలు కలిగిన కమలహారిస్ ఓడిపోవడం మీద సెంటిమెంటల్ గా కొంత చర్చ నడుస్తోంది.
కానీ ఇక్కడే మరో విషయం వెలుగు చూసింది.. కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జెడి వ్యాన్స్ కు భారత్ తో , అందునా తెలుగువారితో అనుబంధం ఉంది. ఆయన భార్య ఉషా చిలుకూరి స్వయానా తెలుగు ఇంటి ఆడపడుచు.
కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం ఆమె పూర్వీకుల స్వస్థలం. ఉషా చిలుకూరి ముత్తాత వీరావధాన్లు ఆ ఊర్లోనే జీవితాంతం నివసించారు. ఆయన కుమారుడైన రామశాస్త్రి బాగా చదువుకొని మద్రాస్ ఐఐటీలో ప్రొఫెసర్ గా స్థిరపడ్డారు. ఆయన కుమారుడైన రాధాకృష్ణ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకొని అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన లక్ష్మీని వివాహం చేసుకున్నారు. ఈ రాధాకృష్ణ , లక్ష్మీ ల సంతానమే ఉషా చిలుకూరి.
ప్రస్తుతం అమెరికా కొత్త ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంట్లో ఇప్పటికీ హిందూ మత సంప్రదాయాలను పూజలను ఆమె కొనసాగిస్తారు. ఉషా చిలుకూరి మతవిశ్వాసాలని వ్యాన్స్ కూడా గౌరవిస్తారు.