హైదరాబాద్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఒక టీం హైదరాబాద్ వస్తోంది. సాయంత్రం 6 గంటలకు బేగంపేటలో ఈ బృందం తెలంగాణ ప్రభుత్వాన్ని కలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యం లోని అత్యున్నత నాయకత్వంతో సమావేశం అవుతుంది. ఈ భేటీలో సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఉపముఖ్య మంత్రులు భట్టి విక్రమార్క, పవన్ కల్యాణ్, తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఇప్పటికే ఈ భేటీకి సంబంధించి కొంత కసరత్తు జరిగింది. తెలుగు రాష్ట్రాల నడుమ అపరిష్కృతంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాల అజెండాను ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. శనివారం నాటి ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం తన అధికారిక నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. అజెండా అంశాలపై రేవంత్ రెడ్డి శనివారం ఉదయం కూడా అందుబాటులో ఉన్న సహచర మంత్రులు, ఉన్నతాధికారులతోనూ చర్చించనున్నట్టు చెబుతున్నారు.
పునర్విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం, తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై సీఎంల భేటీలో చర్చకు రానున్నాయి. పదవ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్సిటీ, ఉన్నత విద్యా మండలి వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. రాజ్‌భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిల అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. అయితే తొమ్మిది, పదవ షెడ్యూల్లోని అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ ఇప్పటికే పలు సమావేశాలు నిర్వ#హంచినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపడంతో రెండు రాష్ట్రాలు ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావచ్చని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి.
ఉమ్మడి రాజధాని జూన్ 2తో పూర్తి
ఈ ఏడాది జూన్ 2తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసినందున ప్రస్తుతం ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, సీఐడీ కార్యాలయం, హెర్మిటేజ్ కాంప్లెక్స్‌తో పాటు మినిస్టర్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్‌లో ఏపీకి కేటాయించిన వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. స్థానికత, ఐచ్ఛికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం చాలా రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉంది. ఏపీ స్థానికత కలిగిన 1,853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశంతో పాటు పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశం కూడా ప్రస్తావనకు రానుంది. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు పంచాయతీలను భద్రాచలంలో కలిపే అంశంపై కూడా చర్చించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల సీఎంను కోరారు. ఢిల్లి లో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది.
మొత్తం మీద ఈ భేటీ అటు రాజకీయంగా ఇటు పరిపాలనాపరంగా ఆసక్తిని కలిగిస్తోంది.