భాగ్యనగరంలో మూడు రోజుల ఆర్ఎస్ఎస్ పరివార సంస్థల పదాధికారుల సమన్వయ సమావేశాలు ముగిశాయి. జనవరి 5 నుంచి 7 వరకు నగరశివారు అన్నోజిగూడలో సమావేశాలు జరిగాయి. పర్యావరణం, కుటుంబ ప్రబోధన్, సామాజిక సమరసత వంటి అంశాల్లో సమన్వయంతో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలపై చర్చ జరిగింది. మూడురోజుల సమన్వయ సమావేశాలకు సంబంధించిన వివరాలను ఆర్ ఎస్ ఎస్ సహా సర్ కార్యవాహ్ డా. మన్మోహన్ వైద్య , అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ ప్రెస్ మీట్లో తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55 వేల శాఖలు జరుగుతున్నాయని, వాటికి హాజరు అయ్యేవారిలో 60 శాతం విద్యార్థులు ఉండగా, మిగిలిన 40 శాతం ఉద్యోగులు, ఇతరులు ఉన్నారని డా. వైద్యా చెప్పారు. స్వాతంత్రానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరుగున పడిన 250 మంది స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తాము వెలికి తీయటం జరిగిందని, ఇందులో సమాజంలోని వివిధ వర్గాలతోపాటు ఎస్సీ ఎస్టీలవారు ఉన్నారని ఆయన చెప్పారు. వీటిని సంస్కార భారతి నాటకాల రూపంలో ప్రచారం చేయనున్నదని తెలిపారు. కరోనా మూలంగా సంఘ్ దైనందిక శాఖ కార్యక్రమాలు తాత్కాలికంగా ఆగినప్పటికీ, తిరిగి పూర్తి స్థాయిలో పుంజుకొన్నట్లు ఆయన తెలిపారు. యువత లో సంఘ కార్యక్రమం పట్ల ఆసక్తి బాగా పెరిగిందని చెబుతూ 2017-21 మధ్య కాలంలో ప్రతీ సంవత్సరం లక్షకు పైగా యువత సంఘ్ కార్యక్రమాల్లో పాలు పంచుకొనేందుకు పేర్లు నమోదు చేసుకొన్నారని ఆయన వెల్లడించారు. ఇక సంఘ్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సేవా సంస్థలు ఆరు వేల బ్లాక్ (మండల్) లలో 10 లక్షల మందికి పైగా కార్యకర్తలకు కరోనాను ఎదుర్కొనే క్రమంలో శిక్షణ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. గత ఏడాది ఆరోగ్య రంగానికి సంబంధించి పోషకాహార లోపాన్ని అధిగమించటానికి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం జరిగిందని, అలాగే ఆర్థిక రంగంలో ఉపాధి కల్పన పై కొన్ని సంస్థలు దృష్టి పెట్టాయని, భారత్ కేంద్రిత విద్యా విధానం పైనా సమావేశాల్లో చర్చించామన్నారు. ఈ సమావేశాలు ప్రతీఏటా సెప్టెంబర్, జనవరి నెలల్లో జరుగుతాయి. వివధ రంగాల్లో పనిచేస్తున్న స్వయం సేవక్ లు తమ అనుభవాలు, భవిష్యత్ కార్యక్రమాల గురించి వివరిస్తారు. సమాజ సంఘటన ద్వారా పరివర్తన కోసం స్వయంసేవక్ లు కృషి చేస్తారు. సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళె లతో పాటు అయిదుగురు సహ సర్ కార్యవాహలు, 36 పరివార సంస్థలకు చెందిన 216 మంది ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొన్నాయి. తర్వాత విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మన్ మోహన్ వైద్య సమాధానాలు ఇచ్చారు. జాతీయ విద్యా విధానం భారతీయ చరిత్ర ఆధ్యాత్మికతను ప్రతిబింబించేట్లు ఉండాలని, ఒకే విద్యా విధానం అనేది రాష్ట్రాల భిన్నత్వానికి ఏమాత్రం ఆటంకం కాదని అన్నారు. వైవిధ్యం అంటే విభేదాలు కావని, జాతి ఏకతకు అంతః సూత్రమైన అంశాలకు అనుగుణంగా ఈ విధానం ఉండాలని ఆయన సూచించారు. కుల వివక్షను రూపుమాపి, సమాజంలో సద్భావనను పెంపొందించటానికి సామాజిక సమరసత ద్వారా కృషి చేస్తున్నమన్నారు. సమాజ జాగరణ అనేది సంఘ్ ప్రధాన కార్యమని, జాగృత సమాజం ప్రభుత్వ విధానాలను ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు.