దాదాపు 20 సంవత్సరాలు తర్వాత ఢిల్లీ వీధుల్లో కమలం పార్టీ సందడి చేస్తోంది. హోరా హోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ సత్తా చాటుతోంది.
తక్కువ అసెంబ్లీ స్థానాలు ఉండడం పూర్తిగా నగర ఓటర్ల కు సంబంధించిన ఎన్నికలు కావడంతో పోటీ తీవ్రంగా ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు.. మొదటి రెండు రౌండ్లో దాదాపు 50 చోట్ల బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగారు. మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేశారు. ఢిల్లీని, అధికార పార్టీ ఆప్ ను చీపుతో ఊడ్చేలా ప్రభంజనం కనిపించింది. దేశ రాజధాని ప్రజలంతా కేజ్రీవాల్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు కనిపించింది.
అయితే రౌండ్లు గడిచే కొద్దీ పోటీ సంక్లిష్టంగా మారింది. కొన్నిచోట్ల ఆప్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు సగానికి పైగా స్థానాల్లో ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 సీట్లలో రెండు పార్టీల మధ్య వెయ్యి ఓట్ల తేడా ఉండగా.. 15 సీట్లలో రెండు పార్టీల మధ్య 2,3 వేల ఓట్ల తేడా కనిపిస్తోంది. దీంతో రౌండ్ రౌండ్‌కు ఆధిక్యాలతో ఉత్కంఠ కలుగుతోంది. కేవలం వందల ఓట్ల తేడాతోనే అభ్యర్థులు బయటపడినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఢిల్లీ సీఎం ఆతిశీ, మాజీ సీఎం కేజ్రీవాల్ మొదట్లో వెనుకంజలో ఉండగా.. ఆ తర్వాత ఇద్దరూ పుంజుకున్నారు. కానీ.. మళ్లీ అగ్ర నాయకులు వెనకబడ్డారు. ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ రంగంలో ఉండడం ద్వారా బిజెపి ఓటు బ్యాంకు కి గండి పడుతుందని లెక్కలు వేశారు,, కానీ ఈ రెండు పార్టీలు ఆప్ గెలుపుకి గండి కొడుతున్నాయి అని కొత్త అంచనాలు వినబడు తున్నాయి. మొత్తం మీద మధ్యాహ్నానికి తుది ఫలితాలు ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తున్నది.