మైసూర్ భూముల స్కాములో అడ్డంగా దొరికిపోయిన కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు నష్ట నివారణ చర్యల్లో పడ్డారు. మైసూర్ మహానగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్లాట్ల కేటాయింపు జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరుతో పెద్ద సంఖ్యలో ప్లాట్స్ కొట్టేశారు అని లెక్క తేలింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు పట్టించుకోవడంలేదని గ్రహించిన సామాజికవేత్తలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిమీద విచారణకు గవర్నర్ ఆదేశించడంతో ప్రభుత్వంలో ఉలికిపాటు మొదలయింది.
అవసరం అయితే దీని మీద సిబిఐ విచారణ జరిపించాలి అన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన కర్ణాటక సర్కారు అడ్డదారి లో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. గతంలో కర్ణాటకలో పెద్ద కేసులను సిబిఐ కు అప్పగించడానికి వెసులుబాటు ఉండేది. ఈ అనుమతిని ఉపసంహరించుకుంటూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిస్‌మెంట్ చట్టం 1946లోని సెక్షన్-6 ప్రకారం సీబీఐ దర్యాప్తు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం ఉంటుంది. దీనిని అడ్డుపెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం దొంగాట మొదలుపెట్టింది. ఇకనుంచి కర్ణాటకలో సిబిఐ దర్యాప్తుకు అనుమతి ఉండదు అని రాష్ట్ర న్యాయ శాఖామంత్రి హెచ్ పాటిల్ వెల్లడించారు. ఇది చాలా పారదర్శకంగా తీసుకున్న నిర్ణయం అని ఇందులో రాజకీయాలు ఏమీ లేవు అని ఆయన సర్ది చెప్పుకుంటున్నారు.
సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తుందని, దాంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. ముడా స్కామ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోలేదని, తప్పుదారి పట్టకుండా కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
డీఎస్ఈపీ చట్టంలోని సెక్షన్-6 ప్రకారమే సీబీఐ ఏర్పాటైంది. దాంతో రాష్ట్రాల అనుమతి లేకుండా సీబీఐ విచారణ చేపట్టలేదు. వాస్తవానికి కాంగ్రెస్ సహా పలు పార్టీలు కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను వేధించేందుకే దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని పార్టీలు మండిపడుతున్నాయి. పంజాబ్, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, తెలంగాణ, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలు సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నాయి.
మొత్తం మీద ప్లాట్స్ స్కామ్ లో నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విమర్శకు ఇది మరింత బలం చేకూర్చింది.