నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వాదనలు విన్న కోర్టు దీనిపై కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై పలు సెక్షన్లపై కేసునమోదు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన అరెస్ట్ అక్రమమంటూ రఘురామ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు సెషన్ కోర్టులో పిటిషన్ వేయాలంది. సుప్రీ తీర్పునకు వ్యతిరేకంగా అరెస్ట్ చేశారన్న రఘురామ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు మంగళగిరి సీఐడీ కార్యాలయంలో రఘురామ కృష్ణంరాజును విచారించిన అధికారులు…ఆయన్ని గుంటూరు 6వ నెంబర్ కోర్టులో హాజరుపరిచినట్టు తెలుస్తోంది.
శుక్రవారం హైదరాబాద్ లోని స్వగృహంలో సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేశారు. ఆయనపై FIR 12/2021 నమోదు చేసిన అధికారులు ఆయనపై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. రఘురామకృష్ణం రాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ అందులో A1గా రఘురామకృష్ణంరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానళ్లను పేర్కొన్నాయి. సిఐడి డిఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేశారు.