కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మావోయిస్టుల పాత్ర ఉందని బిహార్ పోలీసులు నిన్న తెలిపారు. ఓ అగ్రనేతను అరెస్టు చేయడంతో మావోయిస్టుల లింకులు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.
జూన్ లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేఖంగా జరిగిన నిరసనల్లో లఖిసరాయ్ లో రైలును తగులబెట్టడంలో తనతోపాటు తమ సానుభూతిపరుల పాత్ర ఉన్నట్టు మావోయిస్టు నేత చెప్పినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ బృందం నిరసనకారులలో ఒక వర్గాన్ని కాల్చివేసేందుకు.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడానికి ప్రేరేపించిందని సీనియర్ పోలీసు పంకజ్ కుమార్ చెప్పారు.
తెలంగాణ పోలీసుల ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారం మేరకు మావోయిస్టు అగ్రనేత మనశ్యామ్ దాస్ ను లఖిసరాయ్ నగరంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం దాస్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారని, మావోయిస్టు సంబంధిత కార్యకలాపాలను ఈ ఇంటి నుంచే నిర్వహిస్తున్నారని తెలిపారు. రైల్వే ఆస్తుల విధ్వంసం, దహనకాండకు కొందరిని దాస్ ప్రోత్సహించినట్లు చెప్పారు.
బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లోని నక్సలైట్ సంస్థల అగ్రనేతలతో మనశ్యామ్ దాస్ కు ప్రత్యక్ష సంబందాలున్నట్లు.. అతని గదిలో మొబైల్, మావోయిస్టు సాహిత్యం సహా పలు అనుమానాస్పద వస్తువులు లభించాయని పోలీసు అధికారి వెల్లడించారు. మన్శ్యామ్ దాస్ మావోయిస్టు నేతలను కలిసేందుకు అడవులకు వెళ్లేవాడని.. నగరంలోని కొంతమంది నేతలకు కూడా అతడితో సంబంధాలున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా బీహార్ లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు విధ్వంసానికి దిగడంతో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ నిరసనల కారణంగా అనేక కోట్ల విలువైన ఆస్తులు, 2000 కంటే ఎక్కువ రైళ్లు దెబ్బతిన్నాయి.