రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి ప్రారంభించిన ‘ఆపరేషన్ గంగా’ వివరాలను మంగళవారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. భారతదేశం యుద్ధ సమయంలో 18 దేశాలకు చెందిన 147 మంది విదేశీ పౌరులను తరలించిందని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో అన్నారు.
భారతదేశం ఉక్రెయిన్‌లో యుద్ధ సంఘర్షణల సమయంలో పరిస్థితిని సవాలుగా స్వీకరించి ఆపరేషన్ గంగను ప్రారంభించింది. ఉక్రెయిన్ అంతటా భారతీయులు చెదరగొట్టబడ్డారు, ప్రభుత్వానికి లాజిస్టికల్ సవాళ్లు ఎదురవుతున్నాయి. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సుమారు 22,500 మంది పౌరులు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చేలా చేసాము. ఉక్రెయిన్‌లో ఇంకా చిక్కుకుపోయిన కొంతమంది వ్యక్తులు రెండంకెలలో ఉన్నారు. వారిని మేము ట్రాక్ చేస్తున్నాము” అని తెలిపారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరుల్లో ఎక్కువ మంది ఉక్రెయిన్ విశ్వవిద్యాలయాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. వారందరూ దేశవ్యాప్తంగా చెదరగొట్టబడ్డారు. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం 2022 జనవరి నెలలో భారతీయుల కోసం రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. దాదాపు 20,000 మంది భారతీయులు నమోదు చేసుకున్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లోని 35 రాష్ట్రాల నుంచి తరలించబడ్డారు. ఖార్కివ్, సుమీ నుండి విద్యార్థులను తరలించడం చాలా సవాలుతో కూడుకున్నదని, ప్రధాని మోదీ జోక్యం వల్లనే తరలింపు సాకారమైందని అన్నారు. భారతీయులతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌కు చెందిన విద్యార్థులను కూడా రక్షించగలిగాము.. కైవ్, సుమీ, ఖార్కివ్ సహా మారిపోల్లోని హ్యూమానిటేరియన్ కారిడార్ల ద్వారా వారిని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చాము.
సుమీలో చిక్కుకున్న భారతీయులను సురక్షిత మార్గంలో తరలించేందుకు ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన తర్వాతే ఇదంతా సాధ్యమైందని తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)