దక్షిణాది రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక రికార్డు సృష్టించారు. 10 సంవత్సరాల పాటు రాజకీయాల్లో సుదీర్ఘంగా కొట్లాడిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు విజయతీరాన్ని చేరుకున్నారు. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ గెలుపు సాధించడం ద్వారా నూటికి నూరు శాతం విజయం అనే రికార్డును సృష్టించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా విజయవంతంగా దూసుకుని వెళ్తున్నారు. పరిపాలనలో పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా హీరోలు రాజకీయాల్లో నిల తొక్కుకోలేరు అన్న అపప్రదను ఆయన చెరిపేశారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాల్లోని సినిమా హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలి అని భావిస్తున్న యువ హీరోలు పవన్ స్ఫూర్తిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన టాప్ హీరో విజయ్ రాజకీయ కార్యకలాపాలు వేగవంతం చేశారు. ఇప్పటికే ఆయన ‘తమిళ వెట్రి కజగం’ అనే పేరుతో పార్టీని స్థాపించారు.
కానీ రాజకీయాల్లో నిదానంగా అడుగులు వేయాలని ఆయన భావిస్తున్నారు. విజయ్ పార్టీ పెట్టినా తమిళనాడు లో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తానని, అంతకంటే ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయ నని స్పష్టం చేసారు.ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసేసి వచ్చే సంవత్సరం నుంచి విజయ్ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు.
తెలుగు సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఎంచుకొని వాటిని రీమేక్ చేయడం ద్వారా విజయ్.. తమిళంలో చాలా సూపర్ హిట్ లు కొట్టారు. తెలుగు ప్రజల అభిరుచులు ఆలోచనలు తమిళ ప్రజలకు దగ్గరగా ఉంటాయని ఆయనకు తెలుసు. అందుచేతనే పవన్ కళ్యాణ్ బాటని అనుసరిస్తూ రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్ .. కొత్త పార్టీ జెండాని ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో విజయ్ పాల్గొని పార్టీ జెండాని ప్రకటించి, అక్కడే ఆవిష్కరించి దాని గురించి మాట్లాడారు.
పైన కింద ఎరుపు రంగు తో, మధ్యలో పసుపు కలర్ తో ఈ జెండా కనిపిస్తోంది. మధ్యలో రెండు ఏనుగులు ఘీంకరిస్తుండగా వాటి మధ్యలో మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు, దాని చుట్టూ స్టార్స్ ఉన్నాయి.ప్రస్తుతం విజయ్ పార్టీ జెండా తమిళ మీడియాలో వైరల్ గా మారింది.
తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ చాలా బలంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష అన్నాడీఎంకెలో విభేదాలు తీవ్రంగా ఉన్నాయి .భారతీయ జనతా పార్టీ కూడా ఐపీఎస్ అధికారి అన్నామలై నాయకత్వంలో బలం పెంచుకుంటోంది. మరి, ఈ తరుణంలో విజయ్ ఎంతవరకు ప్రభావం చూపిస్తారనేది ఆలోచించాల్సిన అంశం.