టోక్యో ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణ స్వప్నం నెరవేసింది. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా 130 కోట్ల భారతీయుల కళ్లల్లో మెరుపు మెరిపించాడు. ప్రత్యర్థులకు అందనంత దూరం జావెలిన్ ను విసిరి… పసిడి పతకాన్ని అందుకున్నాడు. 13 ఏళ్ల తరువాత భారత్ కు వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన చరిత్ర సృష్టించాడు.
హర్యానాలోని పానిపట్ కు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా సాధించిన ఈ ఘనతతో దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. అతని స్వరాష్ట్రం హర్యానాలోని స్వస్థలం పానిపట్టులోనైతే సంబరాలు అంబరాన్నంటాయి.
ఒలింపిక్స్ లో తొలిప్రయత్నంలోనే పతకాన్ని, అదీ బంగారు పతకాన్ని సాధించిన నీరజ్ ను చూసి భారతీయులు మురిసిపోతున్నారు. అసమాన ప్రదర్శనతో టోక్యోలో అందర్నీ ఆకట్టుకున్నాడు. తొలిరౌండ్ నుంచీ ప్రత్యర్థులు అతని దరిదాపుల్లో లేకుండా పోయారు. 2018 కామన్వెల్త్ గేమ్స్ లోనూ, ఆసియా క్రీడల్లోనూ నీరజ్ స్వర్ణపతకాలు సాధించాడు.
వందేళ్ల తరువాత ఒలింపిక్స్ లో అథ్లెటిక్ విభాగంలో స్వర్ణం సాధించిన నీరజ్ ప్రస్తుతం ఆర్మీలో నాయక్ సుబేదార్ ర్యాంక్ లో ఉన్నాడు. నీరజ్ స్వర్ణం సాధించిన సందర్భంగా ఆర్మీకూడా సంబరాలు చేసుకుంది.
అభినవ్ బింద్రా తరువాత మళ్లీ 13 ఏళ్లకు భారత్ కు వ్యక్తిగత విభాగంలో రెండో పతకం సాధించిన వాడిగానూ చరిత్ర సృష్టించాడు. ఇక లండన్ ఒలింపిక్స్ పతకాల రికార్డును భారత్ అధిగమించింది. ఇప్పటివరకు 7 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఒక స్వర్ణాన్ని, రెండు రజతాల్ని, మూడు కాంస్యాల్ని భారత్ కైవసం చేసుకుంది.
అటు భారత్ కు బంగారు పతకం తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రాకు రాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలువురు అభినందనలు తెలిపారు. నీరజ్ స్వర్ణం ఎప్పటకీ గుర్తుంటుందని… అద్భుత పోరాట పటిమను ప్రదర్శించాడని మోదీ కొనియాడారు.