ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సంస్కరణకు శ్రీకారం చుట్టింది కేంద్రం. బోగస్ ఓట్లను ఏరివేసే ప్రక్రియకు మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపారు. బోగస్ ఓట్లు తొలగిస్తూ…ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్న నిబంధనకు కేంద్రం ఓకే చెప్పింది. ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ నెంబర్ ను లింక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుల మేరకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్ ఓట్ల ఏరివేత వంటి ప్రతిపాదనలు బిల్లులో ఉన్నాయి. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
పాన్-ఆధార్ లింక్ చేసినట్టుగానే, ఓటర్ ఐడీతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. అయితే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రక్రియ ఉంటుంది.
ఇక ఏడాదిలో నాలుగు సార్లు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం కల్పించే ప్రతిపాదనకూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై ఏటా జనవరి 1న 18 ఏళ్లు దాటితేనే నమోదుకు అనుమతిస్తారు. అటు రక్షణ సిబ్బంది ఓటు వేసే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసు అధికారుల విషయంలో గత నిబంధనల్ని సడలించనున్నారు.
దంపతులిద్దరూ ఓటు హక్కు వినియోగించుకొనేలా బిల్లులో మార్పులు చేసింది. ఈ తాజా సంస్కరణలు ఎన్నికల ప్రక్రియలో కీలకం కానున్నాయి.