
అక్టోబర్ 30,ఆదివారం,2022. సమయం 6.45 pm.
గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న మోర్బీ జిల్లా కేంద్రం దగ్గర మచ్చు నది మీద ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ కూలిపోయి కడపటి వార్తలు అందె సమయానికి 132 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కుగా మహిళలు,చిన్నపిల్లలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. మరో 100 ఆచూకీ తెలియరాలేదు బహుశా వాళ్ళు కూడా నీళ్ళలో మునిగి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇంకా !

గుజరాత్ లోని రాజ్ కోట్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్బీ పట్టణం నుండి మచ్చు నది కిందికి ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. 150 ఏళ్ల క్రితం ఈ నది మీద బ్రిటీష్ ఇంజినీర్లు సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టారు. అప్పట్లో వాహనాలు లేవు కాబట్టి కేవలం మనుషులు నది దాటాడానికి వీలుగా కట్టారు బ్రిడ్జ్ ని.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొర్బీ పట్టణ మునిసిపాలిటీ అధీనంలోకి వచ్చింది సస్పెన్షన్ బ్రిడ్జ్ ! మొదట్లో ఉమ్మడి ముంబై రాష్ట్ర PWD శాఖ ఈ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యత చూసేది. తరువాత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ PWD కిందకి వచ్చింది. సంవత్సరానికి రెండు సార్లు PWD ఇంజినీర్లు ఈ బ్రిడ్జ్ పటిష్టత ని పరీక్షించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే ప్రతీ మూడు నెలలకి ఒక సారి మొర్బీ మునిసిపల్ ఇంజినీర్లు బ్రిడ్జ్ ని పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. ఇది ఈ బ్రిడ్జ్ నిర్వహణ చేసే తీరు ఇప్పటివరకు.
2021 లో బాగా పాత పడిపోయినందున రీ ఇన్ఫోర్స్మెంట్ చేయాడానికి గాను టెండర్లు పిలిచింది మొర్బీ మునిసిపల్ కార్పొరేషన్ ! తక్కువ కోట్ చేసిందని [L1] కింద ఒరెవ గ్రూప్ [Oreva Group] అనే సంస్థకి రిపేర్లు,నిర్వహణ కోసం 2021 నుండి 2036 వరకు కాంట్రాక్ట్ ఇచ్చింది మొర్బీ మునిసిపాలిటీ.
ఆరునెలల క్రితం బ్రిడ్జ్ రీ ఇన్ఫోర్స్మెంట్ కోసం ఒరేవా గ్రూప్ ఈ బ్రిడ్జ్ ని మూసేసి కొత్త పైలాన్ లని నిర్మించి మూడు రోజుల క్రితం తిరిగి ప్రజలు తిరగడానికి గాను ఓపెన్ చేసింది.
ఈ బ్రిడ్జ్ రిపేర్ చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వ PWD ఇంజినీర్ల బృందం పరిశీలించి బాగా పాత పడిపోయినందున 100 లేదా 130 మంది ఒకేసారి బ్రిడ్జ్ మీద నడవడానికి మాత్రమే తగిన సామర్ధ్యం ఉందని రిపోర్ట్ ఇచ్చింది. PWD ఇంజినీర్లు ఇచ్చిన రిపోర్ట్ ని ఆధారం చేసుకొని ఒరెవ గ్రూప్ కొత్త పైలాన్ లని నిర్మిస్తే మళ్ళీ పూర్వం లాగా బ్రిడ్జ్ పని చేస్తుంది అని అనుమతి తీసుకొని రిపేర్లు చేసింది ! మూడు రోజుల క్రితమే మళ్ళీ ఓపెన్ చేసింది.
నిన్న సాయంత్రం 6.45 కి హఠాత్తుగ ప్రజలు వంతెన మీద ఉండగానే కుప్ప కూలిపోయింది.
ఎందుకిలా జరిగింది ?

రిపేర్లు చేయకముందు బ్రిడ్జ్ కెపాసిటీ కేవలం 130 మందికి మాత్రం సరిపోతుంది. రిపేర్లు చేసిన తరువాత బ్రిడ్జ్ సామర్ధ్యం 300 మందికి మాత్రమే ! నిన్న బ్రిడ్జ్ కూలిపోయిన సమయంలో బ్రిడ్జ్ మీద 500 మందికి పైగా ఉన్నారు !
ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ మొదటి నుండి పర్యాటక కేంద్రంగా ఉంది! ప్రతిరోజూ వందల్లో పర్యాటకులు ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చి సెల్ఫీ లు తీసుకొని కాసేపు ఉండి వెళ్లిపోతారు !
ఒరేవా గ్రూప్ కక్కుర్తి !
బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి మనిషికి 17/- టికెట్ తీసుకోవాలి. టికెట్ లు జారీ చేసేది ఆ బ్రిడ్జ్ కాంట్రాక్టర్ అయిన ఒరేవా గ్రూప్. ఈ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యత తీసుకొన్నది బ్రిడ్జ్ మీదకి వచ్చే పర్యాటకుల నుండి టికెట్ రూపం లో నిర్వహణ ఖర్చులు తీసుకుంటుంది ఒరేవా గ్రూప్!
500 మందికి బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి టికెట్లు అమ్మింది ఒరేవా గ్రూప్ ! నిన్నటికి మూడు రోజుల క్రితమే బ్రిడ్జ్ ని ఓపెన్ చేశారు మరమ్మత్తులు చేసిన తర్వాత ! కాబట్టి పెట్టిన పెట్టుబడి తిరిగి త్వరగా రాబట్టుకోవడానికి సామర్ధ్యానికి మించి పర్యాటకులని అనుమతించింది ఒరేవా గ్రూప్ !
పరస్పర ఆరోపణలు – వివాదాలు !
సస్పెన్షన్ బ్రిడ్జ్ మరమ్మత్తులు చేసిన తరువాత మొర్బీ మునిసిపాలిటీ నుండి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఒరేవా గ్రూప్. ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్నాక మాత్రమే అదీ ఫిట్నెస్ సర్టిఫికెట్ లో ఇంజినీర్లు ఆ బ్రిడ్జ్ మీదకి ఎంత మంది పర్యాటకులని అనుమతించవచ్చో స్పష్టంగా చెపుతుంది.
కానీ ప్రమాదం జరిగిన తరువాత మొర్బీ మునిసిపల్ కమీషనర్ బ్రిడ్జ్ మళ్ళీ రీ ఓపెన్ చేసినట్లు మా దృష్టికి రాలేదు అన్నాడు. మొర్బీ మున్సిపల్ ఇంజినీర్లు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చిన తరువాత మాత్రం ఆ బ్రిడ్జ్ ని ఓపెన్ చేయడానికి ఒరేవా గ్రూప్ కి హక్కు ఉంటుంది కానీ ఒరేవా గ్రూప్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోకుండా బ్రిడ్జ్ ని ఓపెన్ చేసి ఏకంగా 500 మందికి టికెట్లు అమ్మింది అని ఆరోపిస్తున్నాడు సదరు మునిసిపల్ కమీషనర్ !
ఒరేవా గ్రూప్ మాత్రం తాము ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్నామని చెపుతున్నది ! ఇందులో ఏది నిజం ?
ఒకసారి బ్రిడ్జ్ ని మూసేసి కొత్త పైలాన్లని నిర్మించిన తరువాత రాష్ట్ర PWD ఇంజినీర్లు మాత్రమే దానిని పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. మునిసిపల్ ఇంజినీర్లు మూడు నెలలకి ఒకసారి పరీక్షలు చేసి రిపోర్ట్ మాత్రమే ఇవ్వగలరు.
ఇలాంటి బ్రిడ్జ్ ల విషయం లో చట్టబద్ధ మయిన మెటీరీయల్ ఆడిట్ చేయాలి. ఆడిట్ అయిన తరువాత ఇంజినీర్లు స్వయంగా పరిశీలించి మెటీరీయల్ ఆడిట్ రిపోర్ట్ తో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. కానీ ఇలా జరగలేదు.
గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు చేతులు మారాయి. బ్రిడ్జ్ ఓపెన్ చేసి ప్రజల ప్రాణాలు తీశారు అధికారులు,కాంట్రాక్టర్ కుమ్ముక్కు అయిపోయి.
ప్రధాని మోడీజీ గుజరాత్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ దుస్సంఘటన జరిగింది. మరో రెండు నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బ్రిడ్జ్ కూలి ప్రజల ప్రాణాలు పోవడం ఖచ్చితంగా ఎన్నికల సరళి మీద ప్రభావం చూపిస్తుంది ! – పార్ధసారధి పోట్లూరి