ఓ టెలివిజన్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆర్ఎస్ఎస్ ను తాలిబన్లతో పోల్చిన కవి, సినీగేయరచయిత జావేద్ అఖ్తర్ కు మహారాష్ట్రలోని థాణె కోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది. తమ సంస్థను అపఖ్యాతి పాల్జేసేలా, సంస్థపైన సమాజంలో దురభిప్రాయం కల్గజేసే ఉద్దేశంతోనే జావేద్ అఖ్తర్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆర్ఎస్ఎస్ తన ఫిర్యాదులో ఆరోపించింది. తాలిబన్ల లక్ష్యం, ఆర్ఎస్ఎస్ లక్ష్యం ఒకటేనని అఖ్తర్ అన్నారని సంస్థ ఆరోపించింది. ఈ మేరకు నవంబర్ 12 తేదీలోగా సమాధానం ఇవ్వాలని థాణె చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జావేద్ అఖ్తర్ కి షోకాజ్ నోటీసు జారీచేసింది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, పలువురు క్యాబినెట్ మంత్రులతోసహా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పలువురు కీలక నేతలు ఆర్ఎస్ఎస్ సభ్యులు, మద్దతుదారులని తన ఫిర్యాదులో ఆర్ఎస్ఎస్ పేర్కొంది. తాలిబన్ల మాదిరిగా వ్యవహరించినట్లు తమ సభ్యులలో ఒక్కరిపైన కూడా ఆధారాలు చూపకుండా అఖ్తర్ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తమ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేసిన అఖ్తర్ కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఆదిత్య మిశ్రా వాదనలు వినిపించారు. జావేద్ అఖ్తర్ భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్పైన ఇటువంటి ఆరోపణలు చేయకుండా కట్టడి చేయాలంటూ కోర్టును అర్థించారు.