శివసేన కోసం పోరాటం చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీం కోర్టులో కాస్త ఊరట లభించింది. తన వర్గాన్నే అసలైన పార్టీగా గుర్తించాలంటూ షిండే చేసిన విజ్ఞప్తిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది ధర్మాసనం. ఇక రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా వద్దా అనే అంశంపై సోమవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సుప్రీం తెలిపింది. అసలైన శివసేన తమదేనని పార్టీ గుర్తు విల్లు-బాణం గుర్తును తమకే కేటాయించాలని ఈసీని ఆశ్రయించింది షిండే వర్గం. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సహా కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నందున ఎన్నికల గుర్తుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని సీఈసీనీ ఠాక్రే వర్గం కోరింది.
అయితే విల్లు బాణం గుర్తు తమకే చెందాలంటూ నిరూపించే కొన్ని రుజువులను ఈనెల 8 లోగా సమర్పించాలని ఇరు వర్గాలను ఈసీ ఆదేశించింది. దీంతో ఠాక్రే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం సహా ఇంకా కొన్ని వ్యవహారాలు తేలాల్సి ఉన్నందున పార్టీ గుర్తుపై నిర్ణయాన్ని వాయిదా వేసేలా ఈసీని ఆదేశించాలంటూ ఠాక్రే అత్యున్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించారు.