హైదరాబాద్ లో ఉగ్రవాదుల భారీ కుట్ర బయట పడింది.
రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తన ఇంటిని రహస్య ప్రయోగశాలగా మార్చి, కుట్రకు పాల్పడ్డాడు. వరుసగా డాక్టర్లే కుట్రలకు దిగటం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్ పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేయటంతో మ్యాటర్ బయట పడింది. ఇప్పుడు అతడి అరెస్టుతో నగర పోలీసు విభాగాలు అప్రమత్తమయ్యాయి. అతనికి స్థానికంగా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో దర్యాప్తు చేస్తున్నారు.
…….
ఈ కుట్ర వివరాలు తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.
డాక్టర్ అహ్మద్ ‘రైసిన్’ అనే విష రసాయనాన్ని తయారుచేసి లక్షల మందిని చంపేసేందుకు స్కెచ్ వేశాడు. ఆన్ లైన్ ద్వారా ఉగ్రవాదులకు, ఐసిస్ కు మద్దతుగా పోస్టులు పెట్టేవాడు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్ల తో పరిచయం అయింది. వీరంతా ఐసిస్ సానుభూతిపరులుగా పనిచేస్తూ, దేశవ్యాప్తంగా సున్నిత ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారు. పాకిస్థాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు సేకరించేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. మరో వైపు రసాయన దాడులకు దిగి ఏక కాలంలో లక్షల మందిని చంపేసేందుకు ప్లాన్ చేశారు.
ఇక్కడే మరో విషయం తెలుసుకోవాలి. ఇప్పటికే ఇద్దరు డాక్టర్లు .. ఉగ్రవాద లింకులతో అరెస్టు అయ్యారు: ముందుగా డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్‌ను అరెస్టు చేశారు. ఇతను జమ్మూ-కాశ్మీర్ లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేశాడు. ఇతని లాకర్ నుంచి AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. అతన్ని ఇంటరాగేట్ చేసిన తర్వాత, హర్యానాలోని ఫరీదాబాద్‌లో డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌ను అరెస్టు చేశారు. జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందిన వాడు, భారీగా ఆయుధాలు దాచిపెట్టాడు. ఇతని దగ్గర 360 కిలోల ఆర్డీఎక్స్ దొరికిందంటే ఎంతటి భారీ కుట్రలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
……
దీనిని బట్టి చూస్తే… సినిమాల్లో చూపించినట్లుగా… విషపూరిత రసాయనాలు ఉత్పత్తి చేసి, దేశంలో లక్షల మందిని చంపేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. దీనిని బట్టి ఉగ్రవాదులు ఎంతటి ప్రమాదకరులో తెలుసుకోవచ్చును.



