ఇటీవల కాలంలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థల నాయకులు అకస్మాత్తుగా హత్యకు గురవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నేరుగా వెళ్లి ఉగ్రవాద రాక్షసులను చంపేసి వెళ్ళిపోతున్నారు. భారత్ సహా అనేక దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న హమాస్ సంస్థ చీఫ్ హనియా అకస్మాత్తుగా హత్యకు గురయ్యారు.
ఖతార్‌లో నివసిస్తున్న ఇస్మాయిల్ హనియే.. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు టెహ్రాన్‌కు వెళ్లాడు. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకారంకు హాజరైన కొద్దీ గంటల్లోనే ఈ హత్య జరిగింది. ఈ విషయాన్నీ ఒక వంక ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్, మరోవంక హమాస్ లు నిర్ధారించారు.
దీంతో హమాస్ ఉగ్రవాద సంస్థ లో కలకలం మొదలైంది. హనియేను ఎవరు హత్య చేశారు? ఎలా హత్య చేశారు? వివరాలను ఇరాన్ ఇంకా వెల్లడించలేదు. కానీ, హనియే హత్యపై దర్యాప్తు జరుగుతున్నదనే విషయాన్ని మాత్రం ప్రకటించింది. ఇదిలావుంటే చాలా పాశ్చాత్య దేశాలు ఇంతవరకు హనియే హత్యపై స్పందించలేదు. పరిస్థితులను అంచనా వేస్తున్నామని మాత్రం ఇజ్రాయిల్ సైన్యం పేర్కొన్నది.
అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ, ఉద్రిక్తతలను తగ్గించడానికి వాషింగ్టన్ ప్రయత్నిస్తుందని, అయితే ఇజ్రాయెల్‌పై దాడి జరిగితే దానిని రక్షించడానికి అమెరికా సహాయం చేస్తుందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో ఘోరమైన దాడి వెనుక హిజ్బుల్లా కమాండర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ పేర్కొన్న 24 గంటలలోపే వచ్చిన వార్త ఇది. గాజాలో ఏదైనా ఆసన్నమైన కాల్పుల విరమణ ఒప్పందానికి వెనుకంజ వేసినట్లు కనిపిస్తోంది.
కాగా పాలస్తీనాలోని హమాస్ గ్రూప్‌కు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ హత్యకు గురికావడం జరిగింది.
మొత్తం మీద ఇస్లామిక్ దేశాలలో ఉగ్రవాద సంస్థలు, వాటి నాయకుల మీద పగ పట్టినట్టు కనిపిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గుర్తు చప్పుడు కాకుండా ఉగ్రవాదులను చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటిదాకా ప్రపంచ ప్రజల మీద ఉగ్రవాదులు ఇలా చీకట్లో వచ్చి దెబ్బ కొట్టి వెళ్లేవారు. ఇప్పుడు మేటర్ రివర్స్ అయింది. ఉగ్రవాద సంస్థల నాయకులుని చీకట్లోనే వచ్చి చంపేసి వెళ్ళిపోతున్నారు. దీంతో ఉగ్రవాద సంస్థల అగ్ర నాయకులకు వెన్నులో వణుకు పుడుతోంది.