ఆగస్టు 26 వచ్చిందంటే మదర్ తెరిసా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది ఆమె జయంతి సందర్భంగా
.. పేదలకు సేవ చేసిన దయామూర్తి అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు.
. కానీ ఆమె సేవల్లో మతప్రచారం, మతమార్పిడులు ప్రధాన పాత్ర పోషించాయని అనేక విమర్శలు ఉన్నాయి. 1910లో మేసిడోనియాలో జన్మించిన ఆమె 1929లో భారతదేశానికి వచ్చి, తరువాత కలకత్తాలో “మిషనరీస్ ఆఫ్ చారిటీ” అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం బీదలు, అనాధలు, మరణిస్తోన్న వారిని చూసుకోవడం అని ప్రకటించబడినా, వాస్తవానికి అది క్రైస్తవ మతప్రచారానికి వేదికగా మారిందని అనేక సాక్ష్యాలు చెబుతున్నాయి.
మదర్ థెరిస్సా ఆశ్రయ గృహాలలో అనేక మంది రోగులను ఉంచినా వారికి సరైన వైద్య సదుపాయాలు ఇవ్వకపోవడం, నొప్పిని తగ్గించే మందులు ఇవ్వకపోవడం తరచుగా విమర్శలకు గురైంది. బాధను దేవుని వరమని చెప్పి సహజంగా అంగీకరించమని బోధించడం జరిగింది. అంతర్జాతీయ జర్నలిస్టులు కూడా ఆమె ఆశ్రయ గృహాలు ఆధునిక వైద్య పద్ధతులకు దూరంగా ఉన్నాయని, కానీ విరాళాల రూపంలో వచ్చిన కోట్ల రూపాయలు ఆ దిశగా ఖర్చు కాలేదని బయటపెట్టారు. ఆ నిధుల పెద్ద భాగం క్రైస్తవ మిషనరీల మతప్రచారం కార్యక్రమాలకు వెళ్ళిందనే ఆరోపణలు ఉన్నాయి.
మతప్రచారాన్ని మరింత స్పష్టంగా చూపించే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మరణం అంచున ఉన్నవారి చెవిలో యేసు పేరును పలకించడం, రహస్యంగా బాప్తిస్మం ఇవ్వడం సాధారణంగా జరిగిందని ఆమెతో పనిచేసిన కొందరు తరువాత చెప్పిన విషయాలు ఉన్నాయి. “Missionaries of Charity”లో చేరిన సిస్టర్స్‌కి ఇచ్చే పాఠం కూడా అదే – సేవ ద్వారా యేసు క్రీస్తు ప్రేమను పరిచయం చేయాలి. అంటే సహాయం చేసేటప్పుడు యేసు బోధన తప్పనిసరిగా కలిసేది.
విశ్రుత రచయిత క్రిస్టోఫర్ హిచెన్స్ “The Missionary Position” పుస్తకంలో మదర్ థెరిస్సా అసలు ఉద్దేశం మతప్రచారం మాత్రమేనని ఘాటుగా రాశారు. ఆయన దృష్టిలో ఆమె పేదరికాన్ని తొలగించలేదు, దాన్ని మతప్రచారానికి ఉపయోగించింది. పేదరికాన్ని తగ్గించడానికి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆమె లక్ష్యం కాలేదు. పేదరికం కొనసాగితేనే మతప్రచారం సులభమని ఆమె భావించిందని ఆయన విమర్శించారు.
భారతదేశంలో మిషనరీలు అనుసరించిన పద్ధతులు మదర్ థెరిస్సా సంస్థలో కూడా కనిపించాయి. పాఠశాలల్లో క్రైస్తవ బోధన, ఆసుపత్రుల్లో ప్రార్థనలు, పేదలకు ఆర్థిక సహాయం – ఇవన్నీ ఒకవైపు సేవలా కనిపించాయి. కానీ వాస్తవానికి అవన్నీ మతమార్పిడిని సాధించడానికి మార్గాలుగా పనిచేశాయి. దళితులు, ఆది వాసీలను సమానత్వం పేరిట ఆకర్షించడం, హిందూ సమాజంలోని అసమానతలను చూపిస్తూ “యేసు వద్ద అందరూ సమానులు” అని చెప్పడం సాధారణ వ్యూహం. వరదలు, భూకంపాలు, కరువు వంటి విపత్తుల సమయంలో సహాయం చేస్తూ యేసు పేరుతో మతప్రచారం చేయడం కూడా తరచుగా జరిగేది.
ఈ నేపథ్యంలో మదర్ థెరిస్సా భారతీయ సమాజంలో విభిన్న అభిప్రాయాలకు కారణమయ్యారు. ఒకవైపు ఆమెను నిజమైన సేవామూర్తిగా చూడటం జరుగుతుంటే, మరోవైపు ఆమెను మతమార్పిడుల ప్రతీకగా కూడా చూస్తారు. స్వామి వివేకానంద, గాంధీ, బాబా ఆమ్టే లాంటి సంస్కర్తలు మతప్రచారం లేకుండా సేవ చేశారు. కానీ మదర్ థెరిస్సా మాత్రం సేవను మతప్రచారంతో మిళితం చేశారు.