తెలుగు రాష్ట్రాలలో మౌలిక వసతులని అభివృద్ధి చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున జాతీయ రహదారులను విస్తరించారు. ఆధునిక హంగులతో ఆరు లైన్లు 8 లైన్ల జాతీయ రహదారులను నిర్మించారు.
ఇప్పుడు రాష్ట్రస్థాయి రహదారుల అభివృద్ధికి కేంద్రం తన వంతు సాయం చేసేందుకు ముందు కు వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 13 రాష్ట్రస్థాయి రోడ్ల అభివృద్ధికి 400 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. అదనంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సేతు బంధన్ పథకంలో భాగంగా, గుంటూరు జిల్లాలోని గుంటూరు-నల్లపాడు రైల్వే సెక్షన్లో నాలుగో లైన్ శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి రూ.98 కోట్లను ఆమోదించామని తెలిపారు.
తెలంగాణ– ఏపీని కలిపే కీలకమైన జాతీయ రహదారి (ఎన్‌హెచ్)– 565 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ టౌన్ బైపాస్ కు సంబంధించిన నాలుగు లైన్ల రహదారి నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ సెక్షన్ వరకు కలిపే 14 కిలో మీటర్ల నేషనల్ హైవే మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
నల్లగొండ కేంద్రంగా ట్రాఫిక్కును నివారించేందుకు ప్రణాళికలు చేపడుతున్నారు. నకిరేకల్ నుండి నాగార్జున సాగర్ సెక్షన్ వరకు నల్గొండ టౌన్ కోసం 14 కిలో మీటర్ల పొడవు… 4-లేన్ బైపాస్ నిర్మాణానికి రూ. 516 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్ హెచ్ –565 తెలంగాణ– ఏపీలను కలిపే కీలకమైన జాతీయ రహదారిగా వెల్లడించారు.
ఈ మార్గంలో తెలంగాణలోని నకిరేకల్ వద్ద ఉన్న ఎన్ హెచ్– 65 జంక్షన్ నుండి ప్రారంభమై నల్గొండ– మాచర్ల– ఎర్రగొండపాలెం – కనిగిరి పట్టణాల మీదుగా వెళుతుందని వివరించారు. ప్రస్తుతం నల్గొండ టౌన్ భారీ ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందికి గురవుతుందని, దీని వల్ల పెద్ద ఎత్తున ప్రయాణీకులు అవస్తలు పడాల్సి వవస్తుందని తెలిపారు. అయితే కేంద్ర తీసుకున్న ఈ కొత్త ప్రాజెక్ట్ నల్గొండలో ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా, నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని వెల్లడించారు.
మొత్తం మీద కేంద్రం తీసుకుంటున్న చర్యలతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రోడ్ల పరిస్థితి బాగుపడుతుంది. ఫలితంగా వాహనదారులకు ఊరట లభిస్తుంది.