వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. అగ్రనేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు ప్రధాని మోదీ ప్రచారం చేస్తుంటే మరోవైపు అమిత్ షా చేస్తున్నారు. ఇంకోవైపు మైనార్టీ అగ్రనేత, కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ప్రచారం చేపడుతున్నారు. రెండు రోజుల క్రితం కుచ్బిహార్లో చెలరేగిన హింసపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. అయితే దురదృష్టవశాత్తూ.. దీదీ వారి పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. హింసకు పాల్పడే వారిని సీఎం మమతా బెనర్జీ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ వరుస ఘటనలతో ఒక్కటి మాత్రం స్పష్టమవుతోందని.. టీఎంసీ ఈ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.