తెలంగాణలో ఆర్టీసి మళ్ళీ బాదుడుకు సిద్ధమైంది. ఇదివరకే సెస్‌ల రూపంలో భారీగా టికెట్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా లగేజీ చార్జీల రూపంలో ధరలు పెంచనుంది.
ఒక్కో ప్రయాణికుడు తమ వెంట 50 కిలోల బరువుండే సామగ్రిని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. అంతకు మించి ఉండే సామగ్రిపై చార్జీలు విధించనున్నారు. 25 కిలోల వరకు బరువును ఓ యూనిట్‌గా పరిగణిస్తారు, అంటే ఉచిత పరిమితికి మించి ఒక కిలో ఎక్కువున్నా సరే.. దాన్ని ఒక యూనిట్‌గానే పరిగణించి చార్జీ వేయనున్నారు. 25 కిలోల కంటే ఒక కిలో ఎక్కువున్నా..దాన్ని రెండో యూనిట్‌గా పరిగణించి చార్జీ విధిస్తారు. ఆ మేరకు చార్జీలు నిర్ధారించారు. పల్లె వెలుగులో అయితే ప్రతి 25 కి.మీ చొప్పున, ఎక్స్‌ప్రెస్, ఆ పై కేటగిరీలో ప్రతి 50 కి.మీ చొప్పున చార్జీ మారుతుంది. 100 కిలోలకు పైబడే లగేజీని బస్సుల్లోకి అనుమంతించరు. దాన్ని ఆర్టీసీ కార్గో ద్వారా మాత్రమే తరలించాల్సి ఉంటుంది.
ప్రతి యూనిట్‌కు ఇప్పటి వరకు పల్లెవెలుగు బస్సుల్లో 25 కిలోమీటర్ల దూరం వరకు రూ. 1 వసూలు చేసేవారు. ఈ నెల 22 నుంచి ఆ చార్జీని రూ. 20కి పెంచనున్నారు. అదే 26-50 కి.మీ మధ్య లగేజీ చార్జి ప్రతి యూనిట్‌కు ఇంతకు ముందు రూ. 2గా ఉండగా.. రూ. 40కి సవరించారు. 51-75 కి.మీ. మధ్య రూ. 3కు గాను రూ. 60గా.. 76-100 కి.మీ మధ్య రూ. 4కు గాను రూ. 70గా చార్జీలను సవరించారు.
బస్సుల్లో నిషేధిత వస్తువులు, అగ్ని ప్రమాదాలకు కారణమయ్యేవి, అటవీ సంబంధిత వస్తువులు, పెంపుడు జంతువులు సహా ఏ జంతువులనూ అనుమతించరు. భారీ వస్తువులు, పాడయ్యే వస్తువులకు రెట్టింపు చార్జీ విధిస్తారు. ట్రక్ టైర్‌ను మూడు యూనిట్లుగా పరిగణిస్తారు. టీవీ, రిఫ్రిజరేటర్, సైకిల్, ఫిల్మ్ బాక్స్ (ప్యాక్డ్), వాషింగ్ మెషీన్, కార్ టైర్.. వీటిని రెండు యూనిట్లుగా పరిగణిస్తారు.
చాలాచోట్ల ఆర్టీసీ బస్సుల్లో కూరగాయలు, పాలు, పండ్లను తరలిస్తుంటారు. ఇప్పుడు అలాంటి రైతులు భారీగా చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో లగేజీ చార్జీల పెంపు తప్పనిసరి పరిస్థితిగా మారిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 2002లో లగేజీ చార్జీలను సవరించారని.. ఆ తర్వాత 20 ఏళ్లకు ఇప్పుడే సవరణ జరిగిందని వివరించారు.