తెలంగాణలో ప్రజారోగ్యం దైవాధీనమా?
సంపన్న రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఊపిరితిత్తుల్లో చిన్న సమస్య రాగానే యశోద అనే కార్పొరేట్ ఆస్పత్రికి ఉరుకులు పరుగుల మీద వెళ్లారు. హైదరాబాద్ లో నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఇంకా చాలా సర్కారీ దవాఖానాలున్నాయి. వాటిమీద కెసిఆర్ దొరకు నమ్మకం లేనట్టుంది. కరోనా పేరుతో భారీ బిల్లులు వేసి ప్రజల రక్తం తాగిందనే ఆరోపణలు వచ్చిన యశోద ఆస్పత్రికి వెళ్లడమే సేఫ్ అనుకున్నారేమో. ఇంతా చేసి, అక్కడ జరిగింది ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేని చికిత్స కాదు. సీటీ స్కాన్, ఇతర టెస్టులు చేశారట. ఇవి అన్ని పెద్ద సర్కారీ దవాఖానాల్లోనూ ఉన్నాయి. మరి ఏరికోరి యశోదా దవాఖానాకే పోవడం ఎందుకు?
కెసిఆర్ చెప్పింది చెయ్యరు. చేసింది చెప్పరు. ఇది విపక్షాల విమర్శ. ఇది అబద్ధం కాదు నిజం అని ఆయనే స్వయంగా చాలాసార్లు రుజువు చేశారు. కోటీశ్వరుడైనా సరే కరోనా వస్తే గాంధీకి పోవాల్సిందే అన్నారు పది నెలల క్రితం. కానీ ఆయన పార్టీ నాయకులు, మంత్రులు ఎమ్మెల్యేలు కరోనా వస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరారు. ఇది మంచిది కాదు గాంధీకి పొమ్మని దొరగారు చెప్పలేదు. సామాన్యులు మాత్రం గాంధీకే వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు కెసిఆర్ కు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రికి పోలేదంటే అర్థం ఏంది? ఆ ఆస్పత్రుల్లో చికిత్స సరిగ్గా అందదు అనేనా? అక్కడికి పోతే ఇంతే సంగతులు అని అర్థమా? నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా సర్కారు దవాఖానాకు పోయేవారు. అలా ప్రజలకు ఒక చక్కటి సానుకూల సందేశం, సంకేతాలు పంపేవారు. ఇప్పుడు కల్వకుంట్ల ఏ సంకేతాలు పంపుతున్నారు? తెలంగాణ ప్రభుత్వ వైద్యాన్ని నమ్ముకుంటే ప్రజారోగ్యం దైవాధీనం అనా? ఏమో దొరగారే చెప్పాలి.